Ananthagiri Hills | అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి

Ananthagiri Hills | అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి

Ananthagiri Hills | వెల్‌నెస్ సెంటర్లు, వరల్డ్ క్లాస్ రిసార్ట్స్
ఉపాధికి బోలెడు అవకాశాలు: మంత్రి జూపల్లి
వేల కోట్ల అభివృద్ధి ప్రణాళిక

Ananthagiri Hills | హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ ఊటీగా పేరొందిన వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండలు అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారనున్నాయి. అక్కడి సహజ వనరులకు విఘాతం కలగకుండా గ్లోబల్ ఐకానిక్ ప్రాజెక్టులను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో తొలి దశలో వెల్‌నెస్ సెంటర్ల ఏర్పాటుకు టూరిజం శాఖ డీపీఆర్ రూపొందించింది.

సుమారు రూ. వెయ్యి కోట్లతో వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుకు కేంద్రం పర్యావరణ అనుమతులు మంజూరు చేయడంతో పాటు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.500 కోట్లు కేటాయించనున్నట్లు హామీ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పర్యాటక శాఖ అధికారులు సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో నిమగ్నమయ్యారు.

వేలాది సంవత్సరాల చరిత్రను ఒడిలో దాచుకున్న అనంతగిరి కొండలు ప్రకృతి రమణీయతతో పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. దట్టమైన అడవి అందాలను తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వస్తున్నారు. అలాగే ఇక్కడి జైన కాలంనాటి గుహలను పరిశోధకులు అధ్యయనం చేస్తుంటారు.

అడవిలో మయూరాల విన్యాసాలు, పక్షుల కిలకిలారావాలు, సహజసిద్ధమైన మంచినీటి బుడగలు, మూసీ నది పుట్టిన ప్రాంతాలను చూసి ఆనందించేందుకు వస్తున్న పర్యాటకులకు మరింత చేరువగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది.

అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి

సర్కార్ చేపట్టిన పర్యాటక అభివృద్ధి కార్యక్రమాల్లో రూ.200 కోట్లతో సైట్ డెవలప్‌మెంట్, రూ.100 కోట్లతో థీమ్ పార్కులను ఏర్పాటు చేయనుంది. ట్రెక్కింగ్ కోసం ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. 3,736 ఎకరాల్లో విస్తరించిన అనంతగిరి కొండలు, అడవులు అరుదైన ఔషధ మొక్కలకు నిలయం కావడంతో ఇక్కడ ప్రకృతి వైద్యశాలల ఏర్పాటుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. నిజాం రాజులు నిర్మించిన టీబీ చికిత్స కేంద్రాన్ని ఆధునీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో వరల్డ్ క్లాస్ రిసార్ట్, కార్పొరేట్ తరహా వసతులు, వెల్‌నెస్ సెంటర్లు, యోగా డెస్క్, వెడ్డింగ్ డెస్టినేషన్, స్పా ఏరియాలను ఏర్పాటు చేయడానికి డీపీఆర్లు సిద్ధమయ్యాయి. ఈ మేరకు డెస్టినేషన్ మేనేజ్‌మెంట్ కమిటీని కూడా ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.

అనంతగిరి కొండలను కాకతీయులు, విజయనగర రాజులు విడిది కేంద్రాలుగా వినియోగించుకున్నారు. రాచరిక కార్యక్రమాలు, రాచబంధువుల వినోదాలు ఇక్కడ జరిగేవని తెలుస్తోంది. అనంతరం నిజాం రాజులు అనంతగిరి కొండల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.

దేశంలోనే అరుదైన జైన కాలంనాటి గుహలు ఇక్కడ నేటికీ చెక్కుచెదరక పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. మెగాలిథిక్ బృహత్ రాతియుగం నాటి అవశేషాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనంతగిరి కొండల్లో గ్లోబల్ ఐకానిక్ ప్రాజెక్టులను చేపట్టేందుకు సిద్ధమైంది.

ఉపాధికి బోలెడు అవకాశాలు: మంత్రి జూపల్లి

ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు పర్యాటక శాఖ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అనంతగిరిలో వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

అత్యంత ప్రాచీన సంస్కృతికి నిలయమైన అనంతగిరి కొండలను అంతర్జాతీయ పర్యాటక రంగానికి వేదికలుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. కొండల నుంచి కోటల వరకు పర్యాటకాభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రకృతి, వారసత్వం, ఆధ్యాత్మిక పర్యాటకాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు.