మహిళా సాధికారతకు మహిళా సమైక్య భవనాలు..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : మహిళల సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని, గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలకు శాశ్వత వేదికగా ప్రతి గ్రామంలో మహిళా సమైక్య సొంత భవనాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోందని చిన్నపోర్ల సర్పంచ్ గండ్ల నికిత ప్రశాంత్ అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని చిన్నపోర్ల గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్) నిధులతో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సమైక్య భవనానికి భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, పొదుపు సంఘాల కార్యకలాపాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అవగాహన కార్యక్రమాల నిర్వహణకు ఈ భవనం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. మహిళలు స్వయం ఉపాధి రంగాల్లో ముందుకు సాగేందుకు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు నిర్ణయాత్మక స్థాయికి ఎదగాలంటే సంఘటిత శక్తి అవసరమని పేర్కొన్నారు. గ్రామీణ మహిళల అభివృద్ధికి మహిళా సమాఖ్యలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా మరింత సమర్థవంతంగా సేవలందించే అవకాశం ఏర్పడుతుందని అన్నారు.
నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. భూమి పూజ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, ఉపాధి హామీ పథకం సిబ్బంది, గ్రామ పెద్దలు, యువకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మహిళా సమైక్య భవనం నిర్మాణంతో గ్రామ మహిళలకు ఒక శాశ్వత కార్యాలయం అందుబాటులోకి రానుండటంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ అజయ్ కుమార్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మహ్మద్ రఫీ, సీసీ విజయ్, వివో ఏలు స్రవంతి లలిత తదితరులు పాల్గొన్నారు.
