సీఎం పర్యటనకు పటిష్ఠ బందోబస్తు

సీఎం పర్యటనకు పటిష్ఠ బందోబస్తు

హెలిప్యాడ్‌, పంప్‌హౌస్‌ వద్ద ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు

గద్వాల, ఆంధ్రప్రభ: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌. రేవంత్‌రెడ్డి గురువారం జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు ఐపీఎస్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులకు, పోలీస్‌ సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ముందుగా గుడ్డం దొడ్డి రిజర్వాయర్‌ను పరిశీలించి, అనంతరం పంప్‌హౌస్‌ను సందర్శించనున్నారని తెలిపారు. సీఎం పర్యటన దృష్ట్యా ఏర్పాటు చేసిన పోలీస్‌ బందోబస్తులో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.

హెలిప్యాడ్‌, పంప్‌హౌస్‌ వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ, అవసరమైన చోట అదనపు బందోబస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. పర్యటన పూర్తయ్యే వరకు విధుల్లో ఉన్న సిబ్బంది పూర్తి అప్రమత్తతతో ఉండాలని, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని చెప్పారు.

సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు. భద్రతా చర్యల్లో నిర్లక్ష్యానికి తావు లేకుండా చూడాలని ఆదేశించారు. మొత్తం 700 మంది పోలీస్‌ అధికారులు, సిబ్బందితో ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె. శంకర్‌, డీఎస్పీ మొగిలయ్య, ఆర్డీవో శ్రీనివాసరావు, పోలీస్‌, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply