కుక్కల దాడిలో రెండు మేకలు మృతి
కుక్కల దాడిలో రెండు మేకలు మృతి
- నష్టపరిహారం అందించాలని బాధిత రైతు విజ్ఞప్తి
సిరికొండ, ఆంధ్రప్రభ : సిరికొండ మండలంలోని కుర్దుల్‌పేట్ గ్రామంలో కుక్కల దాడిలో రెండు మేకలు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.
బాధితుడు గుజ్జు మహేష్ తెలిపిన వివరాల ప్రకారం, మేకల కొట్టంలో ఉన్న మేకల మందపై వీధి కుక్కలు అకస్మాత్తుగా దాడి చేశాయి. ఈ ఘటనలో రెండు మేకలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో మేక తీవ్రంగా గాయపడింది.
మేకల పెంపకంపైనే జీవనం సాగిస్తున్న తనకు ఈ ఘటనతో ఆర్థిక నష్టం వాటిల్లిందని గుజ్జు మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కల దాడిలో మృతి చెందిన రెండు మేకలకు ప్రభుత్వం నష్టపరిహారం మంజూరు చేసి ఆదుకోవాలని ఆయన కోరారు.
గ్రామస్థులు కూడా కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోందని, వాటి నియంత్రణకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
