ఓటర్ జాబితా సవరణలో ముందడుగు..

ఓటర్ జాబితా సవరణలో ముందడుగు..

ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించిన ఎమ్మెల్యే రాము కుటుంబం

SIR ప్రక్రియపై ప్రజలకు అవగాహన అవసరం.. ఓటర్ జాబితా పరిపూర్ణతకు సహకరించాలని పిలుపు

గుడివాడ ఆంధ్రప్రభ: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా గుడివాడ మూడో వార్డులోని తన నివాసంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఆయన కుటుంబ సభ్యులకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) శనివారం ఉదయం ఎన్యుమరేషన్ ఫారాలను అందజేశారు.

బీఎల్‌వోలు సూచనల మేరకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఫారాన్ని పూర్తి చేసి తిరిగి వారికి అందజేశారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులు కూడా తమ ఎన్యుమరేషన్ ఫారాలను స్వీకరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ SIR ప్రక్రియపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని అన్నారు. ఓటర్ జాబితా సంపూర్ణంగా, ఖచ్చితంగా ఉండాలంటే ప్రతి కుటుంబం బాధ్యతగా ఫారాలను పూర్తి చేసి సమర్పించాలని సూచించారు.

ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు బీఎల్‌వోలతో పాటు టీడీపీ బూత్ లెవల్ ఏజెంట్లు కూడా SIR ప్రక్రియలో క్రియాశీలకంగా పాల్గొంటున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని, ఓటర్ జాబితా సవరణ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రాము పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అడుసుమిల్లి శ్రీనివాసరావు, నందివాడ క్లస్టర్ ఇన్‌చార్జ్ ఉప్పల వెంకటేశ్వరావు, 63, 64 బూత్‌ల బీఎల్‌వోలు మధురిమ, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.