ఇసుక మాఫియా ఆగడాలు: బీఆర్ఎస్ నాయకుడికి డెత్ థ్రెట్స్
కృష్ణ , ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలో అక్రమ ఇసుక రవాణా, ఇసుక మాఫియా కార్యకలాపాలపై నిరంతరం గళమెత్తుతున్న బీఆర్ఎస్ నాయకుడు శివరాజ్ పటేల్ గుర్జాల్కు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ ద్వారా ప్రాణహాని బెదిరింపులకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
శివరాజ్ పటేల్ గుర్జాల్ తెలిపిన వివరాల ప్రకారం, మండల పరిధిలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై తాను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రజల తరఫున నిరసనలు వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా మాట్లాడడం మానుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు తెలిపారు.
ఫోన్లో తనను దుర్భాషలాడుతూ చంపేస్తామని బెదిరించారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను అని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించడం తన హక్కు అని, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసు శాఖపై ఉందని, బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఇసుక మాఫియాపై ప్రశ్నలు లేవనెత్తుతున్న వారిని బెదిరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
