APL | ఏపీఎల్ లో బుల్స్ బిగ్ విక్టరీ..
- సెంచరీ తో చెలరేగిన రేవంత్
- బిగ్ స్కోర్ ను సైతం కాపాడుకోలేకపోయినా విజయవాడ
- ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా రేవంత్ రెడ్డి
కడప, ఆంధ్రప్రభ : ఏపీఎల్-2026 సీజన్-5లో భీమవరం బుల్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో భారీ విజయాన్ని నమోదు చేసింది. కడప వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో విజయవాడ సన్‌షైనర్స్ నిర్దేశించిన 213 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 17.3 ఓవర్లలోనే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. విధ్వంసకర శతకంతో చెలరేగిన కే. రేవంత్ రెడ్డి భీమవరం విజయంలో కీలక పాత్ర పోషించాడు.
భారీ స్కోరు చేసిన విజయవాడ..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విజయవాడ సన్‌షైనర్స్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి 10 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 124 పరుగులు సాధించి ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. ఓపెనర్ అశ్విన్ హెబ్బార్ కేవలం 29 బంతుల్లోనే 73 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.
మరోవైపు జహీర్ అబ్బాస్ 25 బంతుల్లో 48 పరుగులు, హర్షవర్ధన్ 23 బంతుల్లో 33 పరుగులు చేయడంతో విజయవాడ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. భీమవరం బౌలర్లలో పీవీఎస్ఎన్ రాజు మూడు వికెట్లు పడగొట్టగా, సీహెచ్ రవితేజ, బి. యశ్వంత్ తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు.
రేవంత్ రెడ్డి పరుగుల సునామీ
213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భీమవరం బుల్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ హేమంత్ రెడ్డి త్వరగా పెవిలియన్ చేరాడు. అయితే మరో ఎండ్‌లో కే. రేవంత్ రెడ్డి చెలరేగిపోయాడు. విజయవాడ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన అతడు మైదానం నలుమూలలా షాట్లు ఆడుతూ పరుగుల వరద పారించాడు. కేవలం 61 బంతుల్లోనే 126 పరుగులు చేసి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. అతని దూకుడుకు తోడు రవికిరణ్ కూడా 24 బంతుల్లో 46 పరుగులు చేసి అండగా నిలిచాడు. ఈ జోడీ విజయవాడ బౌలర్లను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టింది. దీంతో భీమవరం బుల్స్ 17.3 ఓవర్లలోనే 218/3 స్కోరు చేసి ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
రేవంత్‌కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
విధ్వంసకర శతకంతో జట్టును విజయతీరాలకు చేర్చిన కే. రేవంత్ రెడ్డిని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. అతని అద్భుత ఇన్నింగ్స్‌తో భీమవరం బుల్స్ ఈ సీజన్లో తమ ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది.
