petrol price hike | ఇంధన ధరల పెంపుపై తీవ్ర ఆందోళన

petrol price hike | ఇంధన ధరల పెంపుపై తీవ్ర ఆందోళన

petrol price hike | ఆయిల్ కంపెనీలకు భారీ నష్టాలు
సామాన్యులపై మరింత భారం
దఫదఫాలుగా పెరిగే అవకాశం
ద్రవ్యోల్బణంపై ప్రభావం

petrol price hike | హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచక తప్పదా? అంటే అవుననే అంటున్నారు ఆర్థికవేత్తలు. ఆయిల్ మార్కెటింగ్ సంస్థల నష్టాలను తగ్గించేందుకు ధరలను మరో రూ.10ల మేర పెంచాల్సి రావొచ్చని అంటున్నారు. ఈ మేరకు ఎమ్కే గ్లోబల్ అనే ఆర్థిక సేవల సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది.

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఫలితంగా దేశీయంగా కూడా ధరలు పెంచకపోతే ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నష్టాలు మరింత పెరుగుతాయని ఎమ్కే గ్లోబల్ సంస్థ పేర్కొంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను సగటున రూ.3 మేర పెంచింది. అంతకుముందే ప్రభుత్వం ఇంధనాలపై ఎక్సైజ్ డ్యూటీలో లీటర్‌కు రూ.10ల మేర కోత పెట్టింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నష్టాలను సగానికైనా తగ్గించుకునేందుకు వచ్చే రెండు మూడు వారాల్లో ధరలను లీటర్‌కు రూ.10 చొప్పున పెంచే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఒక్కసారిగా లేక విడతల వారీగా ఇంధన ధరలు రాబోయే రోజుల్లో పెరగవచ్చని తన నివేదికలో పేర్కొంది. ఇటీవలే మే 15న పెట్రోల్, డీజిల్‌పై ఒకేసారి రూ.3 పెంచిన ప్రభుత్వం.. వాహనదారులకు మరో భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆ పెంపుతోనే సామాన్యుల జేబులకు భారీ చిల్లు పడగా, ఇప్పుడు వినియోగదారుల నెత్తిన మరో పెద్ద పిడుగు పడబోతోంది.

బయటకు వెళ్లాలంటేనే జంకేలా..

ప్రజలు ఇకపై వాహనంతో బయటకు వెళ్లాలంటేనే భయపడేలా మోగుతున్న ఇంధన ధరల మంట ఇప్పట్లో చల్లారేలా ఏమాత్రం కనిపించడం లేదు. దీనివల్ల సామాన్య ప్రజలతో పాటు అన్ని రంగాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో అనూహ్యంగా చోటు చేసుకుంటున్న పరిణామాలే ఈ భారీ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని చెబుతున్నారు. గత కొంతకాలంగా ఇంధన ధరలను స్థిరంగా ఉంచిన కారణంగా ప్రస్తుతం మన దేశంలోని ప్రధాన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి.

తాజా గణాంకాల అంచనాల ప్రకారం.. ప్రపంచ మార్కెట్లో ముడి చమురును కొని, దాన్ని శుద్ధి చేసి ఇక్కడ ప్రజలకు విక్రయించడం ద్వారా ఈ కంపెనీలు లీటర్‌కు సుమారు రూ.17 నుంచి రూ.18 వరకు నష్టపోతున్నట్లు స్పష్టమవుతోంది. కంపెనీలు ఈ భారీ నష్టాల ఊబి నుంచి బయటపడాలంటే ధరలు పెంచక తప్పని విపత్కర పరిస్థితి నెలకొంది. అందుకే లీటర్‌కు కనీసం రూ.10 పెంచడం అనివార్యంమని ప్రముఖ ఆర్థిక సంస్థ ఎమ్కే గ్లోబల్ తన తాజా నివేదికలో స్పష్టంగా వెల్లడించింది.

అయితే ప్రజలపై భారం ఒకేసారి పడకుండా ఉండేందుకు ఈ పెంపు ఒకేసారి కాకుండా దఫదఫాలుగా, దశలవారీగా అమలు చేసే అవకాశం ఉందని ఆ సంస్థ వివరించింది. కంపెనీలు అంచనా వేస్తున్న ఈ రూ.10 పెంపుతో చమురు సంస్థల నష్టాలు కేవలం సగం వరకు మాత్రమే కవర్ అవుతాయి. కానీ సామాన్యుల బతుకు మాత్రం మరింత భారంగా మారుతుంది. ఇంధన ధరలు పెరిగితే నిత్యావసర సరుకుల రేట్లు, రవాణా చార్జీలు కూడా ఆటోమేటిక్‌గా అమాంతం పెరుగుతాయి. ఇది ప్రత్యక్షంగా ద్రవ్యోల్బణానికి దారి తీసి సామాన్యుడి కుటుంబ బడ్జెట్‌ను తలకిందులు చేయడం ఖాయం.

Leave a Reply