Peddapalli | విద్యా ప్రమాణాల పెంపులో పెద్దపల్లికి రాష్ట్ర స్థాయి గుర్తింపు..
- గవర్నర్, సీఎం చేతులమీదుగా కలెక్టర్ కోయ శ్రీహర్షకు విశిష్ట సన్మానం.
పెద్దపల్లి : విద్యా ప్రమాణాల పెంపులో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచింది. ఇందుకు గాను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా విద్యాశాఖ అధికారి శారద లకు విశిష్ట గౌరవం లభించింది. శుక్రవారం హైదరాబాద్ ఎల్.బి స్టేడియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను సన్మానించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
విద్యా రంగంలో నాణ్యతాభివృద్ధి, విద్యార్థుల అభ్యాస ఫలితాల మెరుగుదల, పాఠశాలల సమర్థ నిర్వహణలో పెద్దపల్లి జిల్లాను రాష్ట్రంలో ముందంజలో నిలిపినందుకు ఈ గుర్తింపు లభించింది. జిల్లా విద్యా వ్యవస్థ అభివృద్ధికి కృషి చేసిన జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యారంగ భాగస్వాములు, సిబ్బంది అందరికీ జిల్లా యంత్రాంగం అభినందనలు తెలిపారు. జిల్లా విద్యారంగ అభివృద్ధికి అందరూ సమష్టిగా కృషి చేయడం వల్లే ఈ గౌరవం సాధ్యమైందని, భవిష్యత్తులో కూడా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు.
