Macau Open 2026 | సెమీస్‌కు భారత్..

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : గాయంతో మూడు నెలల విరామం తర్వాత కోర్టులోకి తిరిగి వచ్చిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అశ్మిత చాలిహా అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తోంది. మకావు ఓపెన్ సూపర్-300 టోర్నమెంట్‌లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మిన్ సన్‌పై వరుస గేమ్‌లలో విజయం సాధించిన అశ్మిత మహిళల సింగిల్స్ సెమీఫైనల్‌కు చేరుకుంది. అయితే మరో భారత షట్లర్ అన్మోల్ ఖర్బ్ క్వార్టర్‌ఫైనల్లో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ప్రపంచ 63వ ర్యాంకర్ అశ్మిత, ప్రపంచ 99వ ర్యాంకర్ కిమ్ మిన్ సన్‌ను 21-16, 21-18 తేడాతో 37 నిమిషాల్లోనే మట్టికరిపించింది. ఈ ఏడాది బీడబ్ల్యూఎఫ్ టూర్‌లో ఆమెకు ఇదే తొలి సెమీఫైనల్ ప్రవేశం. అంతకుముందు చైనా మాస్టర్స్ సూపర్-100, మలేషియా మాస్టర్స్ సూపర్-500 టోర్నీల్లో క్వార్టర్‌ఫైనల్ వరకు చేరింది.

కొరియా ఓపెన్ సందర్భంగా కుడి మోకాలి గాయంతో శస్త్రచికిత్స చేయించుకున్న అశ్మిత, దీర్ఘకాల పునరావాసం అనంతరం మళ్లీ పోటీల్లోకి వచ్చింది. సెమీఫైనల్లో ఆమె దక్షిణ కొరియాకే చెందిన పార్క్ గా యూన్‌తో తలపడనుంది. ఇక మరో క్వార్టర్‌ఫైనల్లో భారత యువ షట్లర్ అన్మోల్ ఖర్బ్ తొలి గేమ్‌ను గెలిచినా, ఆ ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ప్రపంచ 36వ ర్యాంకర్, నాలుగో సీడ్ హాన్ కియాన్ షీ చేతిలో 21-14, 15-21, 13-21 తేడాతో ఓటమి చెందింది.