అవమానియా రాజకీయాలు చేస్తున్న వైసిపి..
అవమానియా రాజకీయాలు చేస్తున్న వైసిపి..
పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు దుర్మార్గం..
చిన్నారి అంశాన్ని కూడా రాజకీయాలకు వాడతారా.
సాయికృష్ణ కేసులో కఠిన చర్యలు..
ప్రభుత్వం చిత్తశుద్ధితో విచారణ
జనసేనలో జాతీయ సమైక్యతే అజెండా..
దేశ వైప్తంగా పార్టీ విస్తరణకు వేగం
టూరిజం సంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్.
విజయవాడ, ఆంధ్రప్రభ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మానవత్వాన్ని మరిచి రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. అనారోగ్యంతో ఉన్న చిన్నారి కోరిక మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన పరామర్శను కూడా రాజకీయాలకు వాడుకోవడం అమానవీయ రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన, వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
చిన్నారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పవన్ కల్యాణ్ స్వయంగా వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారని, అవసరమైతే వ్యక్తిగతంగా సహాయం చేయడానికి కూడా ముందుకొచ్చారని తెలిపారు. అలాంటి మానవతా చర్యను సైతం విమర్శించడం రాజకీయ సంస్కారం లేకపోవడాన్ని చూపుతుందని అన్నారు. రాజకీయంగా విమర్శలు చేయవచ్చని, కానీ ఒక చిన్నారి ఆరోగ్య సమస్యను కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరినీ బాధించేలా ఉన్నాయని, గుడివాడ అమర్‌నాథ్ మహిళా హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్రంగా ఖండించాల్సినవేనని పేర్కొన్నారు.
మహిళలకు సమాన హక్కులు, గౌరవం కల్పించాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడిపైనా ఉందని మంత్రి అన్నారు. హోంమంత్రి అనిత సమర్థవంతంగా పనిచేస్తూ రాష్ట్రంలో జరిగే ప్రతి ఘటనపై వెంటనే స్పందిస్తున్నారని, అయినప్పటికీ ఆమెపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరమన్నారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు సంయమనం పాటించాలని సూచించారు.
సాయికృష్ణ అదృశ్యం కేసుపై ప్రభుత్వం అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. ఆరోపణలు వచ్చిన వెంటనే సంబంధిత సీఐ నాగరాజును సస్పెండ్ చేయడంతో పాటు విచారణ అధికారిని నియమించడం ద్వారా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించిందన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కేసును రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేయడం సమాజానికి మంచిది కాదన్నారు.
దర్యాప్తు సంస్థలు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నాయని, వాస్తవాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని మంత్రి తెలిపారు. ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
జనసేన పార్టీ ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ప్రధానంగా జాతీయ సమైక్యత అంశంపై చర్చ జరిగినట్లు మంత్రి వెల్లడించారు. భారతదేశం అన్నింటికంటే ముందు అనే భావనను బలపరచడమే పార్టీ లక్ష్యమని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ నిర్మాణం, జాతీయ ఐక్యత మరింత బలోపేతమవుతోందని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ ఎప్పుడూ దేశభక్తి, జాతీయ సమైక్యత అంశాలపైనే దృష్టి సారిస్తారని, అదే సిద్ధాంతంతో జనసేన ముందుకు సాగుతోందన్నారు.
పార్టీ విస్తరణకు ఇప్పటికే కార్యాచరణ ప్రారంభమైందని, జిల్లాల వారీగా అబ్జర్వర్ల నియామకం జరుగుతోందని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. హైదరాబాద్‌లో జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం పార్టీ విస్తరణలో కీలక మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల నుంచి కూడా జనసేనకు మంచి స్పందన లభిస్తోందని, అయితే పార్టీ విస్తరణ లక్ష్యం కేవలం రాజకీయ లబ్ధి కోసం కాదని, జాతీయ సమైక్యత భావనను బలోపేతం చేయడానికేనని స్పష్టం చేశారు.
