కాళ్లపైనిలబడి నిరసన తెలిపిన ముఖరా కే రైతులు..
ఇచ్చోడ, ఆంధ్రప్రభ : యూరియా కొనుగోలు కోసం ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన యాప్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని ముక్రా(కె) గ్రామ రైతులు వినూత్న నిరసన చేపట్టారు. ఒంటికాళ్లపై, మోకాళ్లపై నిలబడి తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ గాడిగే మీనాక్షి మాట్లాడుతూ, “యాప్‌లో యూరియా అందుబాటులో లేదని చూపిస్తే, షాపుల్లో యూరియా ఎలా లభిస్తుంది?” అని ప్రశ్నించారు. రైతుల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడానికే ఈ నిరసన చేపట్టినట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించిన ఆమె, యూరియా కోసం ప్రవేశపెట్టిన యాప్ కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వెంటనే ఆ యాప్‌ను రద్దు చేసి, నేరుగా ఎరువుల దుకాణాల్లో యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.
గతంలో కేసీఆర్ పాలనలో రైతులు అవసరమైన మేరకు యూరియాను సులభంగా కొనుగోలు చేసుకునేవారని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ప్రతి విషయంలో ఇబ్బందులకు గురిచేస్తోందని, యాప్‌ల పేరుతో మరింత ఇబ్బందులు పెడుతోందని విమర్శించారు. యూరియా కొరతతో రైతులు అవస్థలు పడుతున్నారని, గ్రామీణ ప్రాంత రైతులకు యాప్‌ల వినియోగంపై సరైన అవగాహన లేదని అన్నారు.
అందువల్ల యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేసి, దుకాణాల ద్వారా నేరుగా యూరియా పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గాడిగే సుభాష్, తిరుపతి, విఠల్, దత్త, వెంకటి, సంతోష్, శంకర్, మారుతి తదితరులు, రైతులు పాల్గొన్నారు.
