త్యాగాలకు కేరాఫ్ రాహుల్ గాంధీ కుటుంబం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
త్యాగాలకు కేరాఫ్ రాహుల్ గాంధీ కుటుంబం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి, ఆంధ్రప్రభ: దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబమని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ దేశ సమగ్రత, ఐక్యత కోసం రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర నిర్వహించారని తెలిపారు. దేశం కోసం రాహుల్ గాంధీ కుటుంబం ప్రాణత్యాగాలు చేసిందని పేర్కొన్నారు.
దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవి చేపట్టకుండా మన్మోహన్ సింగ్‌ను ప్రధాని చేశారని అన్నారు. ప్రధాని మోడీ పేదలకు అన్నం పెట్టే ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా దేశ ఐక్యత కోసం రాహుల్ గాంధీ పనిచేస్తున్నారని తెలిపారు. 2029లో రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలుముల లక్ష్మణ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, తిరుపతి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
