VivaTech-2026 | ప్రపంచ టెక్ వేదికపై భారత్ సత్తా..
ఆంధ్రప్రభ : ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో నిర్వహించిన యూరప్‌లోనే అతిపెద్ద సాంకేతిక, స్టార్టప్ ప్రదర్శన ‘వివాటెక్-2026’లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి కార్యక్రమానికి హాజరైన ఆయన, సాంకేతికత, కృత్రిమ మేధస్సు, డిజిటల్ మౌలిక వసతులు, స్టార్టప్ రంగాల్లో భారత్ సాధించిన విజయాలను ప్రపంచానికి వివరించారు.
సాంకేతికత ఆధారంగా గత దశాబ్దంలో భారత్ వేగంగా రూపాంతరం చెందిందని మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ గుర్తింపు వ్యవస్థ, యూపీఐ డిజిటల్ చెల్లింపుల వేదిక, డిజిలాకర్, స్వామిత్వ వంటి కార్యక్రమాలు కోట్లాది మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలోని రియల్‌టైమ్ డిజిటల్ లావాదేవీలలో సగం భారత్‌లోనే జరుగుతున్నాయని వెల్లడించారు.
డిజిలాకర్ ద్వారా 70 కోట్ల మంది వినియోగదారులు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా అసలైన డిజిటల్ పత్రాలను పొందగలుగుతున్నారని తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్లు, ఉపగ్రహ సాంకేతికత, కృత్రిమ మేధస్సు ద్వారా వ్యవసాయం, పాడి పరిశ్రమ, మత్స్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని వివరించారు.
భారత్ చంద్రుడి దక్షిణ ధృవం సమీపంలో అడుగుపెట్టిన తొలి దేశంగా చరిత్ర సృష్టించిందని, అణుశక్తి రంగంలో కూడా కీలక పురోగతి సాధించిందని మోదీ గుర్తుచేశారు. ప్రస్తుతం దేశంలో రెండు లక్షలకుపైగా స్టార్టప్‌లు పనిచేస్తున్నాయని, ఆరోగ్యం, అంతరిక్షం, సైబర్ భద్రత, స్మార్ట్ నగరాలు, స్వయంచాలక రోబోలు, కృత్రిమ మేధస్సు వంటి రంగాల్లో భారత స్టార్టప్‌లు ప్రపంచ స్థాయిలో ఆవిష్కరణలు చేస్తున్నాయని చెప్పారు.
‘ఏఐ అంటే కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే కాదు.. భారత్ దృష్టిలో అది ఆల్ ఇన్‌క్లూజివ్’ అని మోదీ వ్యాఖ్యానించారు. సాంకేతికత అందరికీ చేరాలని, అది జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని, పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని ఆయన స్పష్టం చేశారు.
భారత్-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కొత్త అవకాశాలకు దారి తీస్తుందని పేర్కొన్న మోదీ, భారత్-ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్-2026 సందర్భంగా ఇరు దేశాల మధ్య సాంకేతిక భాగస్వామ్యం మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు భారత్‌తో కలిసి పనిచేసి ప్రపంచానికి ఉపయోగపడే పరిష్కారాలను అందించాలని పిలుపునిచ్చారు.
