నాణ్యమైన విద్య ఉజ్వల భవిష్యత్తుకు పునాది

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాది అని, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అన్ని సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్నాయని గ్రామ సర్పంచ్ మేసా కార్తీక్ అన్నారు.నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మండల కేంద్రం బెజ్జోరా గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం విద్యార్థులకు నూతన పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ మేసా కార్తీక్, పాఠశాల ఉపాధ్యాయురాలు, గ్రామ ఉపసర్పంచ్‌తో కలిసి విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విలువలతో కూడిన విద్యతో పాటు ఉచిత యూనిఫాం, మధ్యాహ్న భోజనం, క్రీడల్లో ప్రత్యేక శిక్షణ, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధన వంటి అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు.

అనంతరం పాఠశాల ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ, ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెంచుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మూడేళ్ల లింబయ్య, ఉపాధ్యాయ బృందం, పాలకవర్గ సభ్యులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.