ఉత్సాహంగా రాష్ట్రస్థాయి యోగాంధ్ర పోటీలు
ఉత్సాహంగా రాష్ట్రస్థాయి యోగాంధ్ర పోటీలు
గుంటుపల్లి డాన్‌బోస్కో స్కూల్ వేదికగా నిర్వహణ
ఆరోగ్యం, క్రమశిక్షణ, ఏకాగ్రతకు యోగానే మార్గమని చాటిన పోటీలు
రాష్ట్రస్థాయి అధికారులతో పాటు పాల్గొన్న కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : యోగాంధ్ర-2026లో భాగంగా రాష్ట్రస్థాయి యోగా పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయని.. ఈ పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి దాదాపు 800 మంది పాల్గొంటున్నారని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం మండలం, గుంటుపల్లి డాన్‌బోస్కో స్కూల్లో రాష్ట్రస్థాయి యోగాంధ్ర పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి డా. సుజాత, పోటీల రాష్ట్ర నోడల్ అధికారి డా. ఝాన్సీలక్ష్మీ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ లక్ష్మశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ పోటీల తీరుతెన్నులను పరిశీలించారు. పోటీల్లో పాల్గొన్న వారిని ఉత్సాహపరిచారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఈ పోటీలు యోగాంధ్ర-ఆంధ్రాస్ గ్లోబల్ యోగా షోకేజ్ థీమ్‌తో జరుగుతున్నాయన్నారు. గ్రామ, మండల, జిల్లాస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని వివరించారు. వ్యక్తిగత కేటగిరీ, గ్రూపు కేటగిరీలో పోటీలు జరుగుతున్నాయని.. వ్యక్తిగత కేటగిరీలో ఆసనాల ప్రదర్శన, ప్రాణాయామం ప్రదర్శనలు, గ్రూపు కేటగిరీలో సింక్రనైజ్డ్ గ్రూపుయోగా ఉన్నాయన్నారు. యోగా సాంగ్, యోగా క్విజ్, యోగా స్లోగన్, యోగా ఎస్సే పోటీలను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూనియర్, యంగ్, సీనియర్ గ్రూప్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా ఆయుష్ అధికారి డా. వై.రత్న ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.
