జర్నలిస్టుపై దాడి చేసిన దోషులను వెంటనే అరెస్టు చేయాలి

  • బీసీ సంఘాలు, జర్నలిస్టు సంఘాల డిమాండ్

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రభ సీనియర్ విలేకరి పాలంచ సత్యనారాయణపై ఈ నెల 12వ తేదీ రాత్రి జరిగిన దాడి ఘటనలో నిందితులను వెంటనే అరెస్టు చేసి, వారి వెనుక ఉన్న కుట్రదారులను గుర్తించి కఠినంగా శిక్షించాలని బీసీ సంఘాలు, జర్నలిస్టు సంఘాల నాయకులు పోలీసు అధికారులను డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజా సమస్యలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం, రైతులు, కార్మికులు, విద్యా వ్యవస్థ తదితర అంశాలను నిరంతరం తన రచనల ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన సీనియర్ పాత్రికేయుడు పాలంచ సత్యనారాయణపై బీరు సీసాతో దాడి చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

సంఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్నాయని, బీరు సీసాపై వేలిముద్రలు లభించే అవకాశం ఉన్నందున పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు వేగవంతం చేసి నిందితులను త్వరగా గుర్తించాలని కోరారు. నిందితులు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబెట్టి శిక్షించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతున్నాయని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితుల అరెస్టులో జాప్యం జరిగితే ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఆంధ్రప్రభ విలేకరి పాలంచ సత్యనారాయణకు బీసీ సంఘాలు, జర్నలిస్టు సంఘాల పూర్తి అండదండలు ఉంటాయని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర కోఆర్డినేటర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్, వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షుడు ఈదుల కృష్ణ, ఉద్యమకారుల సంఘం నాయకుడు జెర్రిపోతుల ప్రభాకర్, జర్నలిస్టులు రవి, జాఫర్, శ్రీనివాస్, బీసీ రాజ్యాధికార సమితి నాయకులు కొక్కు అశోక్, లింగాల నాగరాజు, బోళ్ల స్వామి, వేల్పుల సురేష్ తదితరులు పాల్గొని పాలంచ సత్యనారాయణకు సంఘీభావం ప్రకటించారు.