పరీక్షలో ప్రతి దశా నీట్గా ఉండాల్సిందే!
పరీక్షలో ప్రతి దశా నీట్గా ఉండాల్సిందే!
అజాగ్రత్త అనేది మచ్చుకైనా కనిపించకూడదు
ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా కట్టుదిట్టమైన ఏర్పాట్లు
నీట్ పరీక్ష సమన్వయ సమావేశంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ : దేశ వ్యాప్తంగా ఈ నెల 21న నీట్ (యూజీ) – 2026 పునఃపరీక్ష జరగనున్న నేపథ్యంలో పరీక్ష నిర్వహణలోని ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాలని.. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విధులు నిర్వర్తించాలని అధికారులను కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నీట్ పరీక్ష నిర్వహణపై సమన్వయ సమావేశం జరిగింది. కో ఆర్డినేటర్లు, అబ్జర్వర్లు, పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్లు తదితరులు హాజరైన ఈ సమావేశానికి కలెక్టర్ లక్ష్మీశ హాజరై పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రతి అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. పరీక్ష నిర్వహణలో ప్రతి దశ అత్యంత కీలకమని.. ప్రశ్నపత్రాల భద్రత నుంచి పరీక్ష ముగిసే వరకు అన్ని ప్రక్రియలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 31 పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో పరీక్షకు మూడు గంటల సమయం ఉండగా.. ఈసారి 15 నిమిషాలు అదనపు సమయం అందుబాటులో ఉంటుందని.. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.15 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రానికి అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచి 1.30 గంటల వరకు అనుమతిస్తారన్నారు. అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాన్ని చూసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షకు సకాలంలో హాజరయ్యేందుకు అవకాశముంటుందని పేర్కొన్నారు. బయోమెట్రిక్ తీసుకోవడంలో విద్యార్థులకు చిన్నపాటి అసౌకర్యం కూడా కలగకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, పరిశుభ్రత, భద్రత, వైద్య శిబిరం తదితర ఏర్పాట్లు పూర్తిస్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు కూడా అదే రోజున జరగనున్నందున పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా రవాణా, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్, స్మార్ట్ వాచ్, బ్లూటూత్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించడం జరగదని పేర్కొన్నారు. ప్రతి గదిలో గోడ గడియారం తప్పనిసరిగా ఉంటుందన్నారు. నీట్ పరీక్షల నిర్వహణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ లక్ష్మీశ ఆకాంక్షించారు. సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, నీట్ కోఆర్డినేటర్లు డా. ఎం.గోపీకృష్ణ, ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
