విత్తన దుకాణాలపై టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు
రేగొండ, ఆంధ్రప్రభ: గోరికొత్తపల్లి మండలంలో టాస్క్‌ఫోర్స్ సభ్యులు గురువారం విత్తన దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తహసీల్దార్ హేమ, స్థానిక ఎస్సై ఎస్. త్రిలోక్‌నాథ్ రెడ్డి, భూపాలపల్లి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకుడు రమేష్, మండల వ్యవసాయ అధికారి జి. సారయ్య ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.మండలంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం, పరమేశ్వర ఏజెన్సీస్‌తో పాటు పలు విత్తన దుకాణాలను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్లు, బిల్ పుస్తకాలు, విత్తనాల ఇన్వాయిసులు, సంబంధిత రికార్డులను తనిఖీ చేశారు.
విత్తనాలు కొనుగోలు చేసే రైతులకు లాట్ నంబర్‌తో కూడిన రసీదు తప్పనిసరిగా ఇవ్వాలని, రైతులు ఆ రసీదులను పంట కాలం పూర్తయ్యే వరకు భద్రంగా ఉంచుకోవాలని దుకాణ యజమానులకు సూచించారు.రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ లూజ్ పత్తి విత్తనాలు లేదా అనధికారిక బీటీ-3 పత్తి విత్తనాలు వినియోగించవద్దని హెచ్చరించారు. గ్రామాల్లో తిరుగుతూ విత్తనాలు విక్రయించే వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు లేదా వ్యవసాయ అధికారులకు తెలియజేయాలని సూచించారు.
అధీకృత లైసెన్స్ కలిగిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. అలాగే 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతే పత్తి విత్తనాలు విత్తాలని మండల వ్యవసాయ అధికారి జి. సారయ్య సూచించారు.
