Khushbu daughter | ట్రోలింగ్‌పై ఖుష్బూ కుమార్తె ఆనందిత ఫైర్

Khushbu daughter | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ కుమార్తె ఆనందిత తనపై వచ్చిన ట్రోలింగ్‌పై గట్టిగా సమాధానం ఇచ్చారు. తాను ఇలాంటి ట్రోలింగ్స్‌ను పట్టించుకోనని తెలిపారు. సామాజిక మాధ్యమాలలో తాను అకస్మాత్తుగా బరువు తగ్గడంతో “ట్రాన్స్‌జెండర్‌లా ఉన్నావు” అంటూ ట్రోల్స్ చేయడం బాధించిందన్నారు.

తాను లావుగా ఉన్నప్పుడు కూడా దారుణంగా ట్రోల్ చేసేవారని, ఓ అమ్మాయిపై బాడీ షేమింగ్ చేసే హక్కు మీకు ఎక్కడిదంటూ ఓ ఇంటర్వ్యూలో ఆమె ప్రశ్నించారు. బాడీ షేమింగ్‌ను ఎప్పుడూ సమర్థించనని, ప్రతి ఒక్కరినీ గౌరవించాలనే భావనతో జీవిస్తానని అన్నారు.

కాగా, తాను ‘ఓజెంపిక్’ అనే మందులు వాడి బరువు తగ్గానని జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. 2018లోనే తాను ఫిట్‌నెస్ జర్నీ ప్రారంభించానని, ఆ తర్వాత తనలో ఎన్నో మార్పులు వచ్చాయని, బరువు తగ్గిన తర్వాత ప్రశంసలతో పాటు విమర్శలు కూడా పెరిగాయని వెల్లడించారు. అయినప్పటికీ ఆరోగ్యమే తనకు ముఖ్యమని, ఇతరుల అభిప్రాయాల కంటే తన ఆత్మవిశ్వాసానికే ఎక్కువ విలువ ఇస్తానని స్పష్టం చేశారు.