దొర మెప్పు కోసమే కొప్పుల, ఆర్ఎస్పీ ఆరాటం
దొర మెప్పు కోసమే కొప్పుల, ఆర్ఎస్పీ ఆరాటం
కేసీఆర్ అవమానించినప్పుడు అండగా నిలిచాను..
దోచుకోవడం బీఆర్ఎస్ పార్టీకి పేటెంట్ హక్కు
సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కరీంనగర్, ఆంధ్రప్రభ : హరీష్ రావు మెప్పు పొందడానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొరలు అవమానించినప్పుడు కొప్పుల ఈశ్వర్‌కు సాటి దళితుడిగా అండగా నిలిచానని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దోచుకోవడం, దాచుకోవడం బీఆర్ఎస్ పార్టీకి పేటెంట్ హక్కు అని విమర్శించారు. ఏడాది క్రితం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా తాను బాధ్యతలు చేపట్టానని, గత ప్రభుత్వంలో సంక్షేమ శాఖ మంత్రిగా కొప్పుల ఈశ్వర్ పనిచేశారని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకుల పాఠశాలల కార్యదర్శిగా పనిచేశారని, అయితే ఏడాది కాలంగా ఆయా శాఖలపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
రూ.2 వేల కోట్ల అవినీతి అంటూ అసత్య ప్రచారం
సంక్షేమ శాఖలో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని హరీష్ రావు ఆరోపిస్తే, ఆ శాఖ మంత్రిగా జవాబు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. సంక్షేమ శాఖకు సంబంధించి విద్యార్థులకు అవసరమైన వస్తువుల కొనుగోలు కోసం రూ.683 కోట్లతో టెండర్లు పిలిచామని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రూ.500 కోట్ల కొనుగోళ్లు చేపట్టామని తెలిపారు. మొత్తం రూ.1,183 కోట్లకు టెండర్లు పిలిస్తే, రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని హరీష్ రావు చెప్పడం సిగ్గుచేటని అన్నారు. తాను జవాబు చెబితే, దొరగారి మెప్పు కోసం కొప్పుల ఈశ్వర్ ‘ఖబర్దార్’ అని మాట్లాడటం మరింత సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
2018లో కొప్పుల ఎలా గెలిచారు
2018 ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ ఎలా గెలిచారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసని మంత్రి అన్నారు. కొప్పుల మంత్రిగా ఉన్న సమయంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్ తాళం పోయిన ఘటనపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదన్నారు. 2009లో కొప్పులపై పోటీ చేసి కేవలం 1,165 ఓట్ల తేడాతో ఓడిపోయానని, 2014లో 16 వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయానని గుర్తు చేశారు. తెలంగాణ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి పోటీ చేసిన సమయంలో రాష్ట్రంలో ఎవరికీ డిపాజిట్ రాకపోయినా, తనకు మాత్రమే డిపాజిట్ వచ్చిందన్నారు.
ధర్మపురి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గానికి పెద్దగా ఏమీ చేయలేదన్నారు. డిగ్రీ కళాశాల, రెవెన్యూ డివిజన్, ఆర్టీసీ బస్సు డిపో వంటి కీలక సదుపాయాలు తీసుకురాకపోవడంతోనే 2023 ఎన్నికల్లో ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పారని అన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ధర్మపురి నియోజకవర్గ ఓటర్లు కొప్పుల ఈశ్వర్‌కు మద్దతు ఇవ్వలేదని పేర్కొన్నారు.
జీవన్ రెడ్డి వాటా ఎంతో చెప్పాలి
కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి వడ్ల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారని మంత్రి అన్నారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సీజన్లలో వడ్లు కొనుగోలు చేసిందని, మరి ఆ సమయంలో ఆయనకు ఎంత కమిషన్ వచ్చిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
