యోగాంధ్రకు నంద్యాలలో విశేష స్పందన..

యోగాంధ్రకు నంద్యాలలో విశేష స్పందన..

3.50 లక్షల మంది నమోదు

జూన్ 21 యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం: జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర–2026 కార్యక్రమం ద్వారా ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన సమాజ నిర్మాణానికి బలమైన పునాది పడుతోందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. యోగాభ్యాసంతో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందుతాయని ఆమె పేర్కొన్నారు.

బుధవారం ఉదయం నంద్యాల ఇండోర్ స్టేడియం ఆవరణలో యోగాంధ్ర అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా సాధన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. యోగా నిపుణుల సూచనల మేరకు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన సాధన నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న మానసిక ఒత్తిడులు, జీవనశైలి సంబంధిత అనారోగ్య సమస్యలకు యోగం సమర్థవంతమైన పరిష్కారంగా నిలుస్తోందన్నారు. శరీరం, మనసు, ఆత్మల సమన్వయమే యోగమని, ప్రతి ఒక్కరూ యోగాను తమ దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు.

ప్రతిరోజూ యోగాభ్యాసం చేయడం వల్ల వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన జీవితం మధ్య సమతుల్యత సాధించవచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని గ్రామ స్థాయి వరకు విస్తరించి ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తోందన్నారు.

జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో ఇప్పటివరకు 3.50 లక్షల మంది ‘యోగాంధ్ర’ యాప్, పోర్టల్ ద్వారా స్వచ్ఛందంగా నమోదు చేసుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. యోగా పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తికి ఇది నిదర్శనమన్నారు.

జూన్ 21న జిల్లాలోని ప్రతి గ్రామం, వార్డు, మండల కేంద్రం, నియోజకవర్గ కేంద్రం, జిల్లా కేంద్రంలో భారీ స్థాయిలో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల లక్ష్యమని పేర్కొంటూ, ఆసక్తి గల ప్రజలందరూ పేర్లు నమోదు చేసుకుని యోగా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

జిల్లాలోని అన్ని యోగా సంస్థలు యోగాంధ్ర కార్యక్రమంలో చురుకుగా భాగస్వామ్యం కావడం అభినందనీయమని కలెక్టర్ కొనియాడారు. కార్యక్రమ విజయవంతానికి కృషి చేస్తున్న యోగా గురువులు, యోగా అసోసియేషన్లు, ఆయుష్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, క్రీడాశాఖ అధికారులు, నోడల్ అధికారి డాక్టర్ యశోధరతో పాటు సంబంధిత శాఖలందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో యోగా సాధకులు, విద్యార్థులు, యువత, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా యోగాభ్యాసం చేశారు.