sachin virat | సచిన్‌తో పోలిక సరైంది కాదు..

sachin virat | సచిన్‌తో పోలిక సరైంది కాదు..

కోహ్లీపై జాంటీ రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

sachin virat | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : భారత క్రికెట్‌ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్‌, విరాట్ కోహ్లీల మధ్య పోలికలు తరచూ వినిపిస్తుంటాయి. అయితే అలాంటి పోలికలు అనవసరమని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌, ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన జాంటీ రోడ్స్ అభిప్రాయపడ్డాడు. వేర్వేరు కాలాల్లో క్రికెట్‌ ఆడిన ఇద్దరు మహానుభావులను పోల్చడం కంటే వారి విజయాలను ఆస్వాదించడం మంచిదని పేర్కొన్నాడు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన జాంటీ రోడ్స్‌, విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌, అంకితభావాన్ని ప్రశంసించాడు. సచిన్‌ నెలకొల్పిన అనేక రికార్డులను అధిగమించే సామర్థ్యం కోహ్లీకి ఉందని చెప్పిన ఆయన, అందుకే ఇద్దరిలో ఎవరు గొప్ప అనే చర్చలకు అర్థం లేదన్నాడు. తమ తమ కాలాల్లో భారత క్రికెట్‌ను ప్రపంచ వేదికపై నిలబెట్టిన ఇద్దరూ ప్రత్యేకమైన వారేనని పేర్కొన్నాడు.

కోహ్లీ అత్యుత్తమ ఫీల్డర్‌ కాదా?
విరాట్‌ కోహ్లీ ఫీల్డింగ్‌పై కూడా జాంటీ రోడ్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మైదానంలో కోహ్లీ చూపించే చురుకుదనం, వేగం, ఉత్సాహం ప్రశంసనీయమే అయినప్పటికీ, వాటి ఆధారంగా అతడిని భారత క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ ఫీల్డర్‌గా చెప్పలేమని అభిప్రాయపడ్డాడు. ఫీల్డింగ్‌లో నైపుణ్యం అనేది కేవలం దూకుడు లేదా శక్తి మాత్రమే కాదని, స్థిరత్వం, పరిస్థితులను అర్థం చేసుకునే సామర్థ్యం కూడా ముఖ్యమని చెప్పాడు.

దూకుడే బలం.. అదే బలహీనత కూడా
కోహ్లీ వ్యక్తిత్వంపై స్పందించిన జాంటీ రోడ్స్‌, అతడి దూకుడు జట్టుకు ఎంతో స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నాడు. జట్టు విజయపథంలో ఉన్నప్పుడు కోహ్లీ ఉత్సాహం సహచర ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని చెప్పాడు. అయితే క్లిష్ట పరిస్థితుల్లో అదే ఆవేశం లేదా నిరాశ యువ ఆటగాళ్లపై మానసిక ఒత్తిడిని పెంచే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డాడు. సీనియర్‌ ఆటగాడిగా ఒత్తిడి సమయంలో ప్రశాంతంగా వ్యవహరించడం కూడా అంతే ముఖ్యమని జాంటీ రోడ్స్‌ సూచించాడు.