సోషల్ మీడియా బాధ్యతాయుతంగా వినియోగించాలి..

సోషల్ మీడియా బాధ్యతాయుతంగా వినియోగించాలి..

అసభ్యకర పోస్టులను నియంత్రించడం తప్పు కాదు..
అంబటి వ్యాఖ్యలు ఖండనీయం..
టిడిపి నేతలు మహిళలపై దూషణలు సహించం
టిడిపి జాతీయ ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న..

విజయవాడ, ఆంధ్రప్రభ : సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పేర్కొన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న తెలిపారు. సోషల్ మీడియా ప్రజలకు ఉపయోగపడే వేదికగా ఉండాలని, దానిని వ్యక్తిగత దూషణలు, అసభ్యకర ప్రచారాలకు ఉపయోగించడం సరికాదన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆయన, సోషల్ మీడియా పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలపై అసభ్యకర పోస్టులు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే వాటిని నియంత్రించడం ప్రభుత్వాల బాధ్యతేనని పేర్కొన్నారు.

చట్టవిరుద్ధమైన, అసభ్యకరమైన పోస్టులపై చర్యలు తీసుకోవడాన్ని తప్పుబట్టడం సమంజసం కాదన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ వ్యక్తిగతంగా సోషల్ మీడియాను నియంత్రిస్తున్నారని ఆరోపించడం వాస్తవాలకు విరుద్ధమని బుద్ధ వెంకన్న అన్నారు. చట్ట అమలు సంస్థలు తమ విధుల ప్రకారం చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్లు వారు పోస్టులు చేయాలని ఏ న్యాయస్థానం కూడా చెప్పలేదని ఆయన వ్యాఖ్యానించారు.

వ్యక్తిగత పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించే, అసత్యాలు ప్రచారం చేసే, అసభ్యకర పోస్టులను అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. సోషల్ మీడియా స్వేచ్ఛను బాధ్యతతో వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యంలో భావప్రకటన హక్కుతో పాటు బాధ్యత కూడా ఉంటుందని బుద్ధ వెంకన్న పేర్కొన్నారు.