ప్రజా సమస్యల పరిష్కారమే పీజీఆర్ఎస్ లక్ష్యం

ప్రజా సమస్యల పరిష్కారమే పీజీఆర్ఎస్ లక్ష్యం

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: ప్రజా వేదికలో వచ్చిన ప్రతి అర్జీకి శాశ్వత పరిష్కారం చూపి అర్జీదారులు సంతృప్తి చెందేలా ప్రతి ఒక్కరు పారదర్శకంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి బి. శివన్నారాయణ రెడ్డి, డీపీఓ వై. దోసిరెడ్డి, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.సిహెచ్ అప్పారావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎన్. వెంకటేశ్వరరావు పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యమైన, శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రతి అర్జీని నిర్ణీత గడువులోగా పరిష్కరించి ఫిర్యాదుదారులు సంతృప్తి చెందేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను పూర్తిగా అర్థం చేసుకుని, సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం అందించాలని సూచించారు.

ఈ పీజీఆర్‌ఎస్‌లో 222 దరఖాస్తులు, రెవెన్యూ క్లినిక్‌లో 60 దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.

స్వీకరించిన కొన్ని అర్జీలు ఇలా:

అత్తిలి మండలం వి. నాగరాజు తమ ఇంటి వద్ద రహదారిలో కొందరు సెప్టిక్ ట్యాంక్ తవ్వి రహదారికి ఆటంకం కలిగిస్తున్నారని, దుర్వాసన వస్తోందని సమస్యను పరిష్కరించాలని దరఖాస్తు చేశారు.

గణపవరం మండలం జల్లికొమ్మర గ్రామానికి చెందిన బి. పద్మావతి రీ సర్వే నెం.107/2లో 0.54 సెంట్ల జిరాయితీ వ్యవసాయ భూమి ఉన్నదని, ఆస్తి తనది అని పేర్కొంటూ భూమికి హద్దులు నిర్ణయించాలని కోరారు. అయితే అది కోర్టులో ఉందని అధికారులు చెప్పడంతో సమస్య పరిష్కారానికి విజ్ఞప్తి చేశారు.

వీరవాసరం గ్రామానికి చెందిన మహమ్మద్ షమ్మీ బేగం తన భర్త మరణించడంతో ఒంటరిగా జీవిస్తున్నానని, జీవనాధారం కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేశారు.

పెంటపాడు మండలం బి. కొండేపూడి గ్రామానికి చెందిన పి. వీరయ్య తన ఇంటి సమీపంలో పి. ఏసు అనే వ్యక్తి అనధికారికంగా పెట్రోల్ విక్రయిస్తున్నారని, దీనిని అరికట్టాలని దరఖాస్తు చేశారు.

ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *