రైతు సంక్షేమంపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం
రైతు సంక్షేమంపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : రైతుల అభివృద్ధి, సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ అన్నారు. ధర్మవరం నియోజకవర్గం పోతులనాగేపల్లి గ్రామంలో ఖరీఫ్ 2026–27 సీజన్‌కు సంబంధించి రైతులకు సబ్సిడీ వేరుశనగ విత్తనాలు, ఉచిత కందులు, పచ్చి ఎరువుల విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, ఎన్డీఏ కూటమి నాయకులు కలిసి రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు బాగుంటే దేశం బాగుంటుందని పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని చెప్పారు.
ఖరీఫ్ సీజన్‌కు శ్రీ సత్యసాయి జిల్లాకు 72,289 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు కేటాయించగా అందులో ధర్మవరం నియోజకవర్గానికి 12,928 క్వింటాళ్లు కేటాయించినట్లు తెలిపారు.
ధర్మవరం మండలానికి 3,413 క్వింటాళ్లు, బత్తలపల్లి మండలానికి 2,306 క్వింటాళ్లు, తాడిమర్రి మండలానికి 1,840 క్వింటాళ్లు, ముదిగుబ్బ మండలానికి 5,369 క్వింటాళ్లు కేటాయించినట్లు వివరించారు. రైతులకు 40 శాతం సబ్సిడీపై నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నట్లు తెలిపారు.
వేరుశనగ మద్దతు ధర గతంలో రూ.4 వేల వరకు ఉండగా ప్రస్తుతం రూ.7,263 దాటిందని మంత్రి చెప్పారు. నాణ్యమైన విత్తనాలు, ఆధునిక సాగు విధానాలు, సరైన మార్కెటింగ్ ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని అన్నారు.
రాయలసీమలో గతంలో వ్యవసాయం అంటే కరువు, నీటి సమస్యలు, విద్యుత్ ఇబ్బందులు గుర్తుకు వచ్చేవని ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. బిందు సేద్యానికి సబ్సిడీలు, వ్యవసాయ యంత్రాల కొనుగోలు సహాయం, హార్టికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా రైతులకు ఆదాయ మార్గాలు పెంచుతున్నట్లు వివరించారు.
రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటలు, అధిక ఆదాయం ఇచ్చే వాణిజ్య పంటల వైపు దృష్టి పెట్టాలని సూచించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPO) ద్వారా రైతులు సంఘటితమైతే ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు మరింత లాభం పొందవచ్చని తెలిపారు.
రసాయన ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగం భూమి సారాన్ని తగ్గించి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని పేర్కొంటూ రైతులు దశలవారీగా సేంద్రీయ వ్యవసాయం వైపు అడుగులు వేయాలని సూచించారు.
ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడుతూ ఏళ్లుగా రహదారులు లేని గ్రామాలకు ఇప్పుడు రోడ్లు నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. సీ.సీ కొత్తకోట సచివాలయ పరిధిలో సుమారు రూ.3 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఉప్పనేసినపల్లి–చిగిచర్ల, మోట్లమర్రి, వసంతపురం, చింతలపల్లి గ్రామాలకు రహదారి సౌకర్యాలు మెరుగుపడుతున్నాయని తెలిపారు.
పోతులనాగేపల్లి పరిసర ప్రాంతాల్లో నీటి లభ్యత పెంపునకు వాటర్ షెడ్ ప్రాజెక్ట్ ప్రతిపాదనలు పంపామని, ప్రభుత్వ, CSR నిధులతో ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు దశలవారీగా అమలు చేస్తున్నామని, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత దీపం, పెన్షన్ పంపిణీ పథకాలు ప్రజలకు చేరుతున్నాయని తెలిపారు.
విమర్శలు చేయడం ప్రతిపక్ష హక్కు అని, ప్రజలకు ఉపయోగపడే సద్విమర్శలను స్వీకరించి లోపాలను సరిదిద్దుకోవడం ప్రభుత్వ విధానమని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.
ధర్మవరం ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదానికి తాను రుణపడి ఉన్నానని, ప్రజా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తూ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
