అచ్చంపేట అభివృద్ధే లక్ష్యం..

అచ్చంపేట అభివృద్ధే లక్ష్యం..

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

మంత్రి కోమటిరెడ్డి, సీతక్కతో ఎమ్మెల్యే వంశీకృష్ణ కీలక భేటీ

అచ్చంపేట, ఆంధ్రప్రభ: అచ్చంపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ రాష్ట్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించారు.

హైదరాబాద్ సచివాలయంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ, అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో రోడ్ల విస్తరణ, పెండింగ్ పనుల పూర్తి, మౌలిక వసతుల అభివృద్ధి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం.

అనంతరం ఐకేపీ పథకంలో పనిచేస్తున్న వీఓఏల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే వంశీకృష్ణ, వీఓఏ ప్రతినిధులతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను ప్రగతి భవన్‌లో కలిశారు.

ఈ సందర్భంగా వీఓఏలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలను శ్రద్ధగా విన్న మంత్రి సీతక్క, సంబంధిత అధికారులతో చర్చించి న్యాయమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ, గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వీఓఏల సంక్షేమం కోసం ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే అచ్చంపేటను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ అచ్చంపేటను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

స్థానికుల అభిప్రాయం ప్రకారం, నియోజకవర్గ అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు.