Rayalaseema-University-Corruption : అన్నీ అవకతవకలే Andhra Prabha Top News
Rayalaseema-University-Corruption : అన్నీ అవకతవకలే Andhra Prabha Top News
- వీటికి తోడు అవినీతి
- లెక్కలేని ఖర్చులు
- విజిలెన్స్ విచారణే దిక్కు
- రాయల సీమ వర్సిటీ తీరుపై
- మంత్రి టీజీ భరత్ ఆగ్రహం
- స్నాతకోత్సవానికి రూ.కోట్లు ఖర్చు
- రూసా నిధులు స్వాహా
- విద్యార్థి సంఘాల ఫిర్యాదు
- ఏపీ ప్రభుత్వ దృష్టికి వ్యవహారం
( ఆంధ్రప్రభ , కర్నూలు బ్యూరో),

రాయలసీమ యూనివర్సిటీలో అవినీతి, ఆర్థిక అక్రమాలు, పరిపాలనా లోపాలపై ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ స్వయంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌కు లేఖ రాసి సమగ్ర విచారణ కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. సాధారణంగా విశ్వవిద్యాలయాల వ్యవహారాలు ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఉంటాయి. అలాంటి సమయంలో రాష్ట్ర కేబినెట్ మంత్రి నేరుగా విజిలెన్స్ విచారణ కోరడం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మంత్రి లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం ఏఐఎస్‌ఎఫ్, ఏఐఎస్‌ఏ, పీడీఎస్‌యూ, ఆర్‌పీఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘాలు రాయలసీమ యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఫిర్యాదు చేశాయి. ఆ ఫిర్యాదులను పరిశీలించిన మంత్రి టీజీ భరత్ విజిలెన్స్ శాఖ దృష్టికి తీసుకెళ్లారు.
Rayalaseema-University-Corruption : విద్యార్థుల ప్రధాన ఆరోపణలివే
అవినీతి, పరిపాలనా అక్రమాలకు బాధ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రిజిస్ట్రార్‌ను వెంటనే తొలగించాలి. యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి, ఆర్థిక అక్రమాలపై సమగ్ర విజిలెన్స్ విచారణ జరపాలి.యూనివర్సిటీ భూముల ఆక్రమణలను అరికట్టి ఆస్తులను రక్షించాలి.
Rayalaseema-University-Corruption : రూసా నిధులపై ప్రశ్నలు

మంత్రి లేఖలో ప్రస్తావించిన అత్యంత కీలక అంశం రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ (RUSA) నిధుల వినియోగం. యూనివర్సిటీ అభివృద్ధి కోసం వచ్చిన నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.
ముఖ్యంగా నీటి సరఫరా పనుల పేరుతో ఖర్చులు చూపించినప్పటికీ, పనులు పూర్తిగా జరగలేదని, సంబంధిత బిల్లులు, వ్యయాలకు తగిన ఆధారాలు లేవనే అభియోగాలు విద్యార్థి సంఘాలు చేశాయి.
Rayalaseema-University-Corruption : రూ.2 కోట్లతో స్నాతకోత్సవం
లేఖలో అత్యంత సంచలనాత్మకంగా ప్రస్తావించిన అంశం కాన్వొకేషన్ ఖర్చులు. సుమారు రూ.2 కోట్ల మేర కాన్వొకేషన్ కార్యక్రమాల కోసం ఖర్చు చేశారని, అయితే నిబంధనల ప్రకారం ఖాతాల వివరాలను పూర్తిస్థాయిలో వెల్లడించలేదని ఆరోపించారు. దీంతో ఆర్థిక పారదర్శకత, జవాబుదారీతనంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మంత్రి తన లేఖలో పేర్కొన్నారు.
Rayalaseema-University-Corruption : యూనివర్సిటీ భూముల వివాదం

రాయలసీమ యూనివర్సిటీకి కేటాయించిన భూముల్లో పలు ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తులు భూములను ఆక్రమించినప్పటికీ వాటిని రక్షించడంలో యూనివర్సిటీ యంత్రాంగం విఫలమైందని ఫిర్యాదు చేశాయి. ప్రభుత్వ భూములు, ప్రజా ఆస్తుల పరిరక్షణలో నిర్లక్ష్యం ప్రదర్శించారనే అంశాన్ని కూడా మంత్రి విజిలెన్స్ శాఖ దృష్టికి తీసుకెళ్లారు.
Rayalaseema-University-Corruption : ఎంత మేర నిధుల దుర్వినియోగం?
ప్రస్తుతం మంత్రి లేఖలో స్పష్టంగా ప్రస్తావించిన మొత్తం రూ.2 కోట్ల కాన్వొకేషన్ ఖర్చుల అంశం మాత్రమే. రూసా నిధుల విషయంలో కూడా అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నప్పటికీ, ఎంత మొత్తం దుర్వినియోగం అయిందనే దానిపై లేఖలో ఖచ్చితమైన సంఖ్యలు లేవు. విజిలెన్స్ విచారణ జరిగితేనే అసలు నష్టం ఎంత, బాధ్యులు ఎవరు అనే విషయం అధికారికంగా తేలే అవకాశం ఉంది.
Rayalaseema-University-Corruption : రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చ

ఒక రాష్ట్ర మంత్రి స్వయంగా విజిలెన్స్ విచారణ కోరడం ద్వారా ఈ వ్యవహారం సాధారణ ఫిర్యాదుల స్థాయిని దాటి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి వెళ్లిన అంశంగా మారింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ చేపట్టే విచారణలో ఎలాంటి వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నదే ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
