Karnataka CM | ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగొద్దని ప్రయాణం
Karnataka CM | ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగొద్దని ప్రయాణం
Karnataka CM |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నమ్మ మెట్రోలో ప్రయాణించారు. జూన్ 7న బెంగళూరులోని విధాన సౌధ నుంచి సిల్క్ బోర్డ్ వైపు ఆయన మెట్రోలో ప్రయాణించి ప్రయాణికులతో ముచ్చటించారు. కనకపుర నియోజకవర్గంలో నిర్వహించే కృతజ్ఞతా కార్యక్రమానికి వెళ్లే క్రమంలో రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే వీఐపీ కాన్వాయ్ కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని భావించి, సీఎం శివకుమార్ మెట్రో ప్రయాణాన్ని ఎంచుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. విధాన సౌధ నుంచి సిల్క్ బోర్డ్ మీదుగా సిల్క్ ఇనిస్టిట్యూట్ వైపు ప్రయాణించినట్లు సమాచారం. ఈ ప్రయాణానికి దాదాపు 45 నుంచి 50 నిమిషాల సమయం పట్టినట్లు తెలుస్తోంది.
మెట్రో ప్రయాణం సందర్భంగా డీకే శివకుమార్ ప్రయాణికులతో మాట్లాడారు. నగర రవాణా వ్యవస్థలో మెట్రో పాత్ర, ట్రాఫిక్ తగ్గింపులో దాని ఉపయోగంపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. సామాన్య ప్రయాణికులతో కలిసి ప్రయాణించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇటీవలే కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డీకే శివకుమార్, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రజా రవాణాను వినియోగించడం ద్వారా వీఐపీ కల్చర్‌కు భిన్నమైన సందేశం ఇచ్చారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. డీకే శివకుమార్ జూన్ 3, 2026న కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.
