ఢిల్లీ : ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీకి గట్టి పోటీ ఇస్తుందనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ ఏడాది మొదట్లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన ఆ పార్టీ, ఆ షాక్ నుంచి తేరుకోకముందే ఇప్పుడు మరో పెద్ద కుదుపునకు లోనైంది. పార్టీకి చెందిన 13మంది కౌన్సిలర్లు మూకుమ్మడిగా రాజీనామా చేసి, సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం దేశ రాజధాని రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసిన ఈ 13 మంది కౌన్సిలర్లు, ముఖేష్ గోయెల్ నాయకత్వంలో ‘ఇంద్రప్రస్థ వికాస్ పార్టీ’ పేరుతో కొత్త రాజకీయ వేదికను ప్రారంభించారు. రాజీనామా చేసిన వారిలో ముఖేష్ గోయెల్, హేమంచంద్ గోయెల్, దినేష్ భరద్వాజ్, హిమానీ జైన్, ఉషా శర్మ, సాహిబ్ కుమార్, రాఖీ కుమార్, అశోక్ పాండే, రాజేశ్ కుమార్, అనిల్ రాణా, దేవేంద్ర కుమార్ వంటి ప్రముఖులున్నారు. వీరిలో చాలా మంది గత మున్సిపల్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరినవారే కావడం గమనార్హం.
సీనియర్ నేత అయిన ముఖేష్ గోయెల్ సుమారు 25 సంవత్సరాలుగా మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేస్తున్నారు. ఆయన 2021లో కాంగ్రెస్ పార్టీని వీడి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఇటీవల జరిగిన ఫిబ్రవరి అసెంబ్లీ ఎన్నికల్లో ఆదర్శ్ నగర్ నియోజకవర్గం నుంచి ఆప్ టికెట్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కౌన్సిలర్లు బయటకు వెళ్లడం ఇది మొదటిసారి కాదు. సుమారు మూడు నెలల క్రితమే ఆప్‌కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు అనితా బసోయ, నిఖిల్ చప్రానా, ధరమ్‌వీర్ లు పార్టీని వీడి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. ఇప్పుడు ఏకంగా 13 మంది కౌన్సిలర్లు ఒకేసారి పార్టీని వీడి కొత్త పార్టీ పెట్టడం ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేని దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా వంటి కీలక నేతలు సైతం ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించగా, రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి, కీలక నేతల పరాజయంతో ఇప్పటికే డీలాపడ్డ ఆప్‌కు, ఇప్పుడు కౌన్సిలర్ల రాజీనామాలు మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. ఈ పరిణామాలు ఢిల్లీ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తాయో చూడాలి.