ఆక్రమణల చెరలో వేశ్యకాంతల చెరువు
ఆక్రమణల చెరలో వేశ్యకాంతల చెరువు
- ఆక్రమణలో 90ఎకరాల చెరువు భూమి
- నోటీసులతో చేతులెత్తేసిన యంత్రాంగం
- మంత్రి ఆదేశాలు కార్యరూపం దాల్చేనా అంటున్న ప్రజా సంఘాలు
- కన్నీరు పెడుతున్న సత్తుపల్లి వేశ్య కాంతల చెరువు
సత్తుపల్లి, ఆంధ్రప్రభ : ఆక్రమణలోని చెరువు భూమి విడగొట్టకపోవడంతో ఏ ప్రభుత్వం వచ్చినా నా గతి ఇంతేనా అంటూ సత్తుపల్లి వేశ్య కాంతల చెరువు కన్నీరుగా మున్నీరుగా విలపిస్తుంది .. దాదాపు 315 ఎకరాల్లో విస్తరించి ఉండాల్సిన వేశ్యకాంతల చెరువు ఆక్రమణల పుణ్యమా 100ఎకరాలకు కుచించుకుపోయింది.. ఇటీవల రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెరువు సందర్శించి ఆక్రమణలోని భూములు తీయమని ఆదేశించారు.. ప్రభుత్వ భూమి పేదోళ్ళ భూమి అంటూ కూడా వ్యాఖ్యానించారు.. దీంతో ఆక్రమణకు గురైన భూములకు నక్షా ప్రకారం హద్దులు పాతిన అధికారులు ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేశారు.
అయితే మంత్రి వచ్చి వారం దాటుతున్నా ఆక్రమణలోని అంగుళం భూమి తీయకపోవటంతో మంత్రి ఆదేశాలు కార్యరూపం దాల్చడం కష్టమే అనే అభిప్రాయం ప్రజా సంఘాల నుంచి వినవస్తుంది. 2, 8, 13, 19 సర్వే నెంబర్లలో చెరువుతో పాటు చెరువు ఎఫ్ టి ఎల్, శిఖం, ముంపు భూములు విస్తరించి ఉన్నాయి.. ఈ సర్వే నెంబర్లకు సమీపంలోని ఉన్న వ్యక్తులు నెమ్మ నెమ్మదిగా చెరువు భూమి కూడా ఆక్రమించుకొని ఐదు నుంచి పది ఎకరాల వరకు సాగు చేస్తున్నారు.. ఇందులో ఖరీదైన భవంతులు, స్విమ్మింగ్ పూల్స్, షాపింగ్ కాంప్లెక్స్ లు ఏర్పడ్డాయి.. సర్వే జరిపి అక్రమణలో ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా తొలగించమని మంత్రి ఆదేశించారు.
కానీ ఇక్కడ అదేమీ జరగడం లేదని రైతులు చెబుతున్నారు.. ఆక్రమణలోని భూములు విడగొడితే పట్టణంలోని దాదాపు వెయ్యి నిరుపేద కుటుంబాలకు ఇండ్ల స్థలాలు కల్పించి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే దంపతులు ప్రయత్నం ప్రారంభించారు.. ఎమ్మెల్యే దంపతుల సంకల్పానికి స్థానికులు కూడా చాలామంది తోడ్పాటుగా ఉన్నారు.. కానీ నోటీసులు జారీ చేసిన అధికారులు వెను వెంటనే పనులు ప్రారంభించకపోవడంతో ఆక్రమణలో ఉన్న వాళ్ళు కోర్టు స్టేట్ తెచ్చే ప్రమాదం ఉందని పలువురు భావిస్తున్నారు.. ఆక్రమణలు తొలగించడానికి ఆలస్యం జరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఆక్రమణదారులకు అవకాశం కల్పిస్తున్నారా అనే సందేహం ప్రజల్లో వ్యక్తమౌతుంది…
గాడిదల వాగు కూడా ఆక్రమణ..
పై భాగంలోని అటవీ ప్రాంతం నుంచి వేశ్యకాంతల చెరువుకు వరద నీరు చేర్చే గాడిదల వాగు కాలువ కూడా ఆక్రమణకు గురైంది.. దాదాపు 100 అడుగుల వెడల్పులో ఉండాల్సిన ఈ వాగు ఆక్రమణల పుణ్యమా పూర్తిగా కూచించుకుపోయింది.. ఇందులోనూ అధికారుల హస్తం ఉన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.. గతంలో ఇక్కడ పనిచేసిన రెవెన్యూ అధికారులు కొందరు ముడుపులకు లాలూచీపడి ఇలాంటి దొడ్డిదారి వ్యవహారానికి పాల్పడినట్లుగా సమీప రైతులు చెబుతున్నారు..
గ్రామకంఠం ఆక్రమణకు నోటీసులు.
ఈ ఏరియాలో దాదాపు ఎకరం గ్రామకంఠం ఆక్రమణలో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.. ఎందుకు మిమ్మల్ని ఆక్రమణ నుంచి తొలగించకూడదంటూ గ్రామకంఠం సాగులో ఉన్న ఎస్.కె నజీర్, వర్ధన్నపు మైసపురాజు, నరుకుళ్ళ ప్రసాద్ తదితరులకు నోటీసులు జారీ చేసినట్లుగా తహసిల్దార్ తెలిపారు..
మిగతా భూమి సర్వే ఎప్పుడు..
ఒక్క గ్రామ కంఠం ఎకరం భూమి మాత్రమే సర్వే జరిపి హద్దులు పాతిన అధికారులు ఆక్రమణలోని మిగతా చెరువు భూమి ఎందుకు పట్టించుకోలేదనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. చెరువు ముంపు ప్రాంతాన్ని లేపి ఫ్లాట్లుగా చేసి అమ్మారు కొందరు.. టీచర్ ఒకరు దాదాపు 14 ఎకరాల్లో ఎంచక్కా రెండు పంటలు పండించుకుంటున్నారు .. ఏకంగా స్విమ్మింగ్ పూల్ కట్టి ఎంజాయ్ చేస్తున్నారు ఇంకొకరు.. కొబ్బరి తోట సాగు చేస్తూ ఆదాయం అందుకుంటున్నారు మరికొందరు.. ఇలా 315ఎకరాల్లో ఉండాల్సిన చెరువు కుచించుకుపోవడానికి కారణమైన వ్యక్తుల నుంచి భూమి తీయడం అధికారుల వల్ల కావడం కష్టమే అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతుంది… ఎందుకంటే వీళ్ళ వెనుక బడా బాసులు ఉన్నట్లుగా ప్రచారం సాగుతుంది..
