పేదల ఇళ్లు.. బ్రోకర్లకు బంగారు బాతు!

పేదల ఇళ్లు.. బ్రోకర్లకు బంగారు బాతు!

రాజీవ్‌నగర్‌లో సగానికి పైగా ప్లాట్లు, ఇళ్ల విక్రయాలు

మళ్లీ స్థలాల కోసం క్యూలో పాత లబ్ధిదారులే.. ఆందోళన వ్యక్తం చేస్తున్న నిజమైన నిరుపేదలు

సత్తుపల్లి, ఆంధ్రప్రభ : నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలు, గృహాలను కొందరు లబ్ధిదారులు విక్రయించి మళ్లీ కొత్తగా పంపిణీ చేసే స్థలాల కోసం ప్రయత్నాలు చేయడం సత్తుపల్లిలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రాజీవ్‌నగర్ కాలనీలో ప్లాట్లు, ఇళ్ల కొనుగోలు-అమ్మకాల వ్యవహారంలో బ్రోకర్ల పాత్ర పెరుగుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2008లో సత్తుపల్లి-సిద్దారం రహదారి సమీపంలో రైతుల సాగులో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు దాదాపు 700 ప్లాట్లుగా విభజించి పేద కుటుంబాలకు పంపిణీ చేశారు. అనంతరం ఆ కాలనీకి ‘రాజీవ్‌నగర్’గా పేరు పెట్టి, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించారు. లబ్ధిదారులు గృహాలు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా అందించింది.

అయితే కాలక్రమేణా సగానికి పైగా లబ్ధిదారులు తమకు కేటాయించిన ప్లాట్లు, ఇళ్లను విక్రయించినట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు గణనీయమైన సంఖ్యలో ప్లాట్లు ఇప్పటికీ ఖాళీగానే ఉండిపోయాయి. ఇళ్ల నిర్మాణం జరగకపోవడంతో వాటిలో అడవి పెరిగి, సర్పాలు, ఇతర విషజీవులు సంచరిస్తున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు.

ప్రస్తుతం రాజీవ్‌నగర్‌లో ఒక ప్లాటు ధర రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు పలుకుతుండటంతో పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. కొందరు వ్యక్తులు ఒకేసారి మూడు నుంచి నాలుగు ప్లాట్లు కొనుగోలు చేసి భవిష్యత్తులో అధిక ధరకు విక్రయించే లక్ష్యంతో ఎదురుచూస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.

ప్లాట్లు, ఇళ్ల కొనుగోలు-అమ్మకాల వ్యవహారంలో బ్రోకర్లకు భారీగా గిరాకీ పెరిగింది. ఒక్కో లావాదేవీపై రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు కమిషన్ లభిస్తుండటంతో ఈ వ్యాపారంలోకి కొత్త వ్యక్తులు కూడా అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఆందోళన కలిగిస్తున్న మరో అంశం ఏమిటంటే.. గతంలో ప్రభుత్వ స్థలాలు, ఇళ్లు పొందిన కొందరు లబ్ధిదారులే వాటిని విక్రయించి మళ్లీ కొత్తగా ప్రభుత్వం స్థలాలు పంపిణీ చేస్తుందనే సమాచారంతో దరఖాస్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిజంగా ఇల్లు, స్థలం లేని నిరుపేద కుటుంబాలు అవకాశాలు కోల్పోతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ నిరుపేదల కోసం మరో గృహ కాలనీ ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడుతున్న నేపథ్యంలో, గతంలో లబ్ధి పొందినవారే మళ్లీ స్థలాల కోసం ప్రయత్నించడం చర్చకు దారితీస్తోంది. నేతల ఇళ్ల చుట్టూ తిరుగుతూ మరోసారి స్థలాలు కేటాయించాలని కోరుతున్న ఘటనలు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.

రాజీవ్‌నగర్‌లో ఖాళీగా ఉన్న ప్లాట్ల పరిస్థితిపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. వినియోగంలో లేని ప్లాట్లను పరిశీలించి, అవసరమైతే వాటిని తిరిగి స్వాధీనం చేసుకుని నిజమైన అర్హులైన నిరుపేదలకు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply