21 మంది స్వచ్ఛందంగా రక్తదానం..

నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ : ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోటరీ క్లబ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 21 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతా సేవలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించినట్లు క్లబ్ అధ్యక్షుడు పాకాల నరసింహారావు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యవంతులైన వ్యక్తులు నిర్దిష్ట వ్యవధిలో రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదన్నారు. ఒకరు ఇచ్చే రక్తం మరొకరికి పునర్జన్మను ప్రసాదించే అవకాశముందని పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రమాదాలు, అత్యవసర వైద్య పరిస్థితుల్లో రక్తం అందక చాలామంది ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారని, అలాంటి సందర్భాల్లో స్వచ్ఛంద రక్తదాతలు అందించే రక్తం అమూల్యమైనదని చెప్పారు. రక్తదానం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయనే అపోహలను ప్రజలు విడనాడాలని సూచించారు.

ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు వచ్చి అవసరమైన వారికి ప్రాణదాతలుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. రక్తదానం ద్వారా ఒక వ్యక్తి మాత్రమే కాదు, అతని కుటుంబానికి కూడా ఎంతో మేలు చేసినవారమవుతామని పేర్కొన్నారు.

రక్తదాన శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బందికి క్లబ్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ గంజి రమేష్, ప్రాజెక్టు చైర్మన్ కోటగిరి చంద్రశేఖర్, క్లబ్ సభ్యులు గిరీష్ కుమార్, సంపత్ కుమార్, శేఖర్, ముక్క శ్రీనివాస్, బంగారి వీరబ్రహ్మం, నాగేశ్వరరావు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply