ఐక్యతతో కాపుల సత్తా చాటుదాం..

ఐక్యతతో కాపుల సత్తా చాటుదాం..

  • మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం.
  • కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం.

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : ఐక్యతతో కాపుల సత్తా చాటుదామని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుటం పురుషోత్తం అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం ఆర్ఆర్ వార్డెన్లో సాదుల వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఆదివారం నిర్వహించిన జిల్లా మున్నూరు కాపు సంఘం ఎన్నికల్లో పెద్దపల్లి పట్టణం 23వ వార్డు కౌన్సిలర్ జడల సురేందర్ జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు పుట్టం పురుషోత్తం పటేల్ నూతన జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన జడల సురేందర్‌కు నియామక పత్రాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్నూరు కాపులు అన్ని రంగాల్లోనూ రాణించే సత్తా కలిగిన వారని కొనియాడారు.

ప్రస్తుతం జరుగుతున్న జనగణనలో మున్నూరు కాపుల సంఖ్యను తక్కువగా చూపుతున్నారని, ఇది సామాజిక, రాజకీయ వాటాను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని అధిగమించేందుకు ప్రతి యువకుడు బాధ్యతగా ఇంటింటి వివరాలు సరైన గణాంకాలను ప్రభుత్వానికి అందించాలని పిలుపునిచ్చారు. చట్టసభల్లో మున్నూరు కాపులకు రావాల్సిన సముచిత వాటాను సాధించుకునేందుకు సంఘం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

జిల్లా కేంద్రంలో మున్నూరు కాపుల కోసం ఒక అధునాతన కమ్యూనిటీ హాల్, పేద విద్యార్థుల కోసం ప్రత్యేక హాస్టల్ ఏర్పాటు చేయడమే తమ తక్షణ లక్ష్యమని దీని కోసం స్థల సేకరణకు సంబంధించి ప్రభుత్వం, స్థానిక నాయకుల మద్దతును కూడకట్టుకొని నూతన అధ్యక్షుడు ముందుకు సాగాలన్నారు. కుల సంఘం కేవలం సంఘటితం కావడం మాత్రమే కాదని అన్ని కుల సంఘాలతో సమన్వయం చేసుకుంటూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. నూతన అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన జడల సురేందర్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, కుల ఐక్యత కోసం నిరంతరం శ్రమిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్ది పెంటయ్య, రాష్ట్ర కార్యదర్శి ఇసంపల్లి వెంకన్న పటేల్, నాయకులు మల్క రామస్వామి, బిరుదు క్రిష్ణ, ఎలువాక రాజయ్య, అమిరిశెట్టి రామస్వామి, తూముల శ్రీనివాస్, బండారు రాంమూర్తి, ఆకుల మహేందర్, గంట రమేష్, వునుకొండ శ్రీధర్, విజయలక్ష్మి, హరి శంకర్, ఆకుల వివేక్, పూదరి మహేందర్, తదితరులు పాల్గొని నూతన అధ్యక్షున్ని శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.