డబుల్ మర్డర్ కేసులో కోర్టు సంచలన తీర్పు
- నిందితుడికి జీవిత ఖైదు
సిరిసిల్ల, ఆంధ్రప్రభ: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లో నమోదైన రెండు హత్య కేసులో నిందుతుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ మంగళవారం సిరిసిల్ల జిల్లా ప్రధాననాయమూర్తి నీరజ సంచలన తీర్పు ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ మహేశ్ బి.గితే తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామనికి చెందిన వంగ సందీప్ రెడ్డికి, బీనబోయిన దేవయ్యకి మధ్య భూ వివాదాలు ఉన్నాయన్నారు. భూమి విషయంలో తరచూ గోడవల నేపథ్యంలో సందీప్ రెడ్డి దేవయ్యను ఎలాగైనా చంపాలనే ఉద్దేశ్యంతో 2018 మార్చి 18న దేవయ్య కుటుంబ వేడుక హాజరు అయిన సమయంలో చాటుగా వచ్చిన సందీప్ రెడ్డి దేవయ్యపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో దేవయ్య మరణించగా, దేవయ్య తండ్రి బీనబోయిన సిద్దిరాములు గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి సీఐ భన్సిలాల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం నిందితుడు వంగా సందీప్ రెడ్డిని రిమాండ్కి తరలించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
అలాగే నిందితుడు సందీప్ రెడ్డికి, కామారెడ్డికి చెందిన మాన్నె నరసింహులుకి మధ్య కూడా భూ వివాదాలు ఉండగా, తరుచూ గోడవలు జరిగేవి. ఈ క్రమంలో సందీప్ రెడ్డి ఎలాగైనా నర్సింహులును చంపాలనే ఉద్దేశ్యంతో 2022 జూలై 31న నర్సింహులు, అతని స్నేహితులు కలిసి పార్టీ చేసుకుంటున్న సమయంలో సందీప్ రెడ్డి వచ్చి నర్సింహులుపై గొడ్డలితో దాడి చేయగా నర్సింహులు అక్కడికక్కడే మరణించారు. నర్సిం వాులు అన్న కొడుకు అయిన మన్నె రాజు గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చెయ్యగా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లో అపట్టి సీఐ మొగిలి కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం నిందితుడు సందీప్ రెడ్డి ని రిమాండ్కి తరలించి కోర్టులో చార్జిషీట్ ఫైల్ చేశారు.
కోర్టు విచారణలో భాగంగా రెండు హత్య కేసులు విచారణ దశలో అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో కోర్ట్ మానిటరింగ్ ఎస్ఐ రవీందర్ నాయుడు, కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్, అప్పటి, ప్రస్తుత సీఐలు మొగిలి, భన్సీలాల్, వెంకటేష్, గంభీరావుపేట్ ఎస్ఐ శ్రీకాంత్, కోర్టు మానిటరింగ్ కానిస్టేబుల్ నవీన్ ఆధ్వర్యంలో 20 మంది సాక్షులను ప్రవేశ పెట్టగా ప్రాసిక్యూషన్ తరుపున అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ వాదించగా, శాస్త్రీయ, సాంకేతిక సాక్ష్యలను పరిశీలించిన తరువాత జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిందితుడైన సందీప్ రెడ్డికి రెండు కేసులలో జీవిత ఖైదు విధిస్తు సంచలన తీర్పు వెల్లడించారు.
సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకోలేరని, శిక్షల ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని జిల్లా ఎస్పీ తెలిపారు. పోలీసులు, ప్రాసిక్యూషన్ సమన్వయంతో వ్యూహాత్మకంగా న్యాయ విచారణ, న్యాయ నిరూపణ నిర్వహించి నిందితులకు తప్పనిసరిగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ కేసుల్లో నిందితులకు శిక్ష పడటంలో కృషి చేసిన అదనపు ఎస్పీ చంద్రయ్య, అప్పటి పీపీ పెంట శ్రీనివాస్, ప్రస్తుత డీఎస్పీ నాగేంద్రచారి, అప్పటి, ప్రస్తుత సీఐలు మొగిలి, బన్సీలాల్, వెంకటేష్, కోర్ట్ మానిటరింగ్ ఎస్ఐ రవీందర్ నాయుడు, కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్, గంభీరావుపేట్ ఎస్ఐ శ్రీకాంత్, కోర్టు మానిటరింగ్ కానిస్టేబుల్ నవీన్లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

