సమస్యల వలయంలో సర్కార్ బడులు

సమస్యల వలయంలో సర్కార్ బడులు

– కోట్ల నిధులు కేటాయించినా ముందుకు సాగని పాఠశాలల మరమ్మతు పనులు

– శిథిల భవనాలు, మౌలిక వసతుల కరువుతో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: ప్రభుత్వ విద్యకు ఆది నుండి గ్రహణం వీడడం లేదు. శిథిలావస్థలో ఉన్న భవనాల్లోనే విద్యాబోధన సాగుతుండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు దినదిన గండంగా కాలం వెళ్లదీస్తున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఈ నెల 15 నుండి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నాయి. అయితే, అరకొర వసతులతోనే సర్కార్ బడులు విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. మండలంలోని 51 పాఠశాలల మరమ్మతుల కోసం రూ. 5 కోట్ల 81 లక్షల డీఎంఎఫ్‌టీ (DMFT) నిధులను కలెక్టర్ కేటాయించినా, పనులు మాత్రం ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వానొస్తే గదుల పైకప్పుల నుండి నీరు కారడం, ప్రహరీ గోడలు, మరుగుదొడ్లు సరిగా లేకపోవడంతో చదువులు సాగేదెట్లా అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

మండలంలోని 16 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు, 9 ప్రాథమికోన్నత పాఠశాలలకు (రూ. 55.5 లక్షలు), 26 ప్రాథమిక పాఠశాలలకు (రూ. 2 కోట్ల 53 లక్షలు) నిధులు మంజూరయ్యాయి. పెద్దపల్లి బాలికల పాఠశాల, రాఘవాపూర్, రంగపూర్, నిట్టూర్, అప్పన్నపేట, రాగినేడు, బొంపెల్లి తదితర హైస్కూళ్లకు లక్షలాది రూపాయలు కేటాయించినా.. అక్కడక్కడ చిన్న పనులు తప్ప ప్రధాన మరమ్మతులు ప్రారంభం కాలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఈ పనులను పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

తక్షణమే పనులు చేపట్టకుంటే ఆందోళన: ఏబీవీపీ

ప్రభుత్వ పాఠశాలల మరమ్మతు పనులను తక్షణమే ప్రారంభించాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ డిమాండ్ చేశారు. నిధులున్నా పనులు చేయకపోవడం వల్లే విద్యార్థులు ప్రభుత్వ బడులకు దూరం అవుతున్నారని విమర్శించారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనందున సకాలంలో వసతులు కల్పించాలని, లేనిపక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.