Five-departments-single-officer | పెరుగుతున్న పాలనా భారము
Five-departments-single-officer | పెరుగుతున్న పాలనా భారము
Five-departments-single-officer | ప్రజావాణిలో పెరుగుతున్న దరఖాస్తుల వరద, ఆశలు
గ్రామీణాభివృద్ధిలో జాప్యం, ప్రజల్లో అసంతృప్తి
స్త్రీ నిధి, మెప్మాలో సవాళ్లు, పరిపాలనా సమస్యలు
క్షేత్రస్థాయిలో ప్రభావం, పాలనలో నిర్వహణ లోపం
Five-departments-single-officer | హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న ఐదు ప్రధాన శాఖలకు ఒకే అధికారి ని ఇంచార్జిగా నియమించడంతో గ్రామీణ, పట్టణ అభివృద్ధి వ్యవస్థలలో పాలన అస్తవ్యస్తం అవుతోంది. ఫలితంగా ఆయా వ్యవస్థలు పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయి. ఐఏఎస్ అధికారిణి దివ్య దేవరాజన్ సెర్ఫ్ సీఈవోగా, మెప్మా ఎండీగా, స్త్రీ నిధి ఎండీగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్, ప్రజావాణి నోడల్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇన్ని శాఖల బాధ్యతలను నిర్వహిస్తున్న కారణంగా ఏ ఒక్క శాఖకూ గణనీయంగా సమయం కేటాయించలేని పరిస్థితి నెలకొన్నది. ఫలితంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపించి, ప్రజలకు అందాల్సిన సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. అన్ని శాఖల్లో ఫైళ్లు పెండింగ్‌లో పడుతున్న కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందనే వ్యాఖ్యలున్నాయి.
ప్రజలతో సంబంధం ఉండే శాఖలే… విభాగాలే కావడంతో…
సెర్ఫ్, మెప్మా, స్త్రీ నిధి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ప్రజావాణి — ఈ శాఖలన్నీ రోజువారీగా లక్షలాది మంది ప్రజలతో, ముఖ్యంగా మహిళా సంఘాలు, గ్రామీణ కూలీలు, సామాన్యులతో ముడిపడి ఉన్నాయి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామ పరిపాలనను అనునిత్యం అప్రమత్తతతో పర్యవేక్షించాల్సి ఉంటుంది. గ్రామాలకు నిధులు, సిబ్బంది పనితీరు పర్యవేక్షణ, జీతభత్యాలు, ప్రభుత్వ స్కీముల మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడంతో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి. చేసిన పనులకు బిల్లుల మంజూరులోనూ జాప్యం జరుగుతున్నదని ప్రచారం జరుగుతున్నది.
దీనికి తోడు ఉపాధి హామీ పథకంపై పర్యవేక్షణ లోపించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పూర్తి స్థాయిలో ఫోకస్ పెడితేనే సమస్య కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు జులై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వీబీ జీ రామ్ జీ చట్టం అమలులోకి వస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆ శాఖకు పూర్తి సమయం కేటాయించే అధికారి ఉంటేనే పాలన గాడిన పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు.. ప్రభుత్వం సెర్ఫ్, మెప్మా సంస్థలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చింది. కానీ, రెండింటిలో సమస్యలు పరిష్కారం కాలేదు.
ప్రజావాణికి దరఖాస్తుల వరద.. పరిష్కారమెక్కడ?
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. తమ సమస్యలు తీరుతాయన్న ఆశతో వేలాది మంది అర్జీలు పెట్టుకుంటున్నారు. అయితే ప్రజావాణికి నోడల్ అధికారిగా దివ్య దేవరాజన్ ఆ దరఖాస్తులను పరిశీలించి, సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారాన్ని పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ, మరో నాలుగు శాఖల నిర్వహణ కారణంగా ప్రజావాణికి తగినంత సమయం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో దరఖాస్తులు పరిష్కారంలో జాప్యం జరుగుతున్నదని పలువురు వాపోతున్నారు.
మహిళల ఆర్థిక బలోపేతానికి స్త్రీ నిధి కీలకం. స్త్రీ నిధి ఎండీగా పని చేసిన విద్యాసాగర్ రెడ్డి రిటైర్ కావడంతో ఇంచార్జిగా దివ్య దేవరాజన్‌కు బాధ్యతలు అప్పగించారు. రుణాల మంజూరు, రికవరీ వంటి అంశాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. అంతేకాదు నిత్యం ఉద్యోగులపై మానిటరింగ్, గతంలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకొని, పక్కదారి పట్టిన నిధులను రికవరీ చేయాల్సి ఉంటుంది. మొత్తం మీద ఐదు శాఖలకు ఇంచార్జిగా వ్యవహరిస్తున్న దివ్య దేవరాజన్‌కు శాఖలకు సంబంధించిన సమావేశాలు, వీడియో కాన్ఫరెన్సులు, సచివాలయంలో మీటింగులకే సమయం సరిపోతున్నట్లు సమాచారం.
