Patel | సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం.. ఆదర్శనీయం

- దేశాన్ని ఏకఖండంగా తీర్చిదిద్దిన మహనీయుడు
- 2K రన్ కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ
Patel | నారాయణపేట ప్రతినిధి, (ఆంధ్రప్రభ): దేశాన్ని ఏకఖండ భారతంగా రూపుదిద్దడంలో అపూర్వమైన నాయకత్వం ప్రదర్శించిన భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ మనలో సమైక్యతా స్ఫూర్తిని నింపిన మహానుభావుడని ఎంపీ డీకే అరుణ అన్నారు. సర్దార్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకొని సోమవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని భారంబావి దగ్గర నిర్వహించిన 2K రన్ (2K Run) కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ చరిత్రలో చిరస్మరణీయ నేత అని అన్నారు. 1875 అక్టోబర్ 31న గుజరాత్‌లోని నదియార్‌లో జన్మించిన పటేల్, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రాజనీతిజ్ఞుడిగా సమాజంలో అపార సేవలందించారని తెలిపారు.
ఇంగ్లాండ్‌లో బారిష్టర్ పట్టాను అందుకొని స్వదేశానికి చేరిన తర్వాత జాతీయోద్యమంలో పాల్గొని, పౌరహక్కులు, రైతుల హక్కుల కోసం పోరాడారని అన్నారు. స్వతంత్ర భారత్‌కు తొలి ఉప ప్రధానిగా, హోం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన పటేల్.. 530కుపైగా సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేయడంలో కీలకపాత్ర పోషించారని, అందుకే ఆయనను ‘ఉక్కు మనిషి’గా చిరస్మరణీయుడిగా నిలిచారని అరుణ పేర్కొన్నారు. యువత ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశ నిర్మాణంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
యువతీయువకులు ఉత్సాహంగా 2కె రన్‌లో పాల్గొనడం అభినందనీయం అని ఎంపీ చెప్పారు. శారీరక, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంలో రన్నింగ్ వంటి క్రీడలకు పెద్దపీట వేయాలని సూచించారు. ముఖ్యంగా గంజాయి, సైబర్ నేరాలు వంటి రెండు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, వీటివల్ల ఎన్నో కుటుంబాలు చీకటిలో మునిగిపోతున్నాయని యువత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సిక్తపట్నాయక్, అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షులు సత్యయాదవ్, నాయకులు నాగురావు నామాజీ, రతంగ్ పాండు రెడ్డి, పగుడాకుల శ్రీనివాస్, కొండయ్య, ఉమ్మడి జిల్లా యువజన అధికారి కోటానాయక్, కోఆర్డినేటర్ తిరుపతి రెడ్డి, విద్యాశాఖ అధికారి గోవిందు రాజులు తదితరులు పాల్గొన్నారు.
