యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి
యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి టీజీ భరత్
కర్నూలు, ఆంధ్రప్రభ : ప్రభుత్వం కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పిలుపునిచ్చారు. నైపుణ్యాభివృద్ధి, అనుభవ సాధన ద్వారానే యువత ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని పేర్కొన్నారు.
కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నాలుగో మెగా జాబ్ మేళాను శనివారం మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇప్పటివరకు కర్నూలులో నిర్వహించిన మూడు మెగా జాబ్ మేళాల ద్వారా వేలాది ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పటికీ, వాటిలో సగం మందే ఉద్యోగాల్లో చేరుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగం పొందడమే కాకుండా, అందులో చేరి అనుభవాన్ని సంపాదించడం కూడా అంతే ముఖ్యమని సూచించారు.
ఈ జాబ్ మేళాలో 19 ప్రముఖ సంస్థలు పాల్గొని దాదాపు 1,500 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ముందుకు వచ్చాయని తెలిపారు. యువత తమ ప్రతిభను నిరూపించుకుని ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రారంభ దశలో లభించే ఉద్యోగాల ద్వారా అనుభవం సంపాదిస్తే భవిష్యత్తులో మరింత మెరుగైన అవకాశాలు దక్కుతాయని వివరించారు.
కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని మంత్రి స్పష్టం చేశారు. మారుతున్న సాంకేతిక ప్రపంచంలో యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అందుకే నైపుణ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
కర్నూలు జిల్లా ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్‌లో రిలయన్స్, అగస్త్య, గ్రీన్ హైడ్రోజన్, సోలార్, విండ్ పవర్ రంగాలకు చెందిన భారీ పరిశ్రమలు కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయని మంత్రి తెలిపారు. జయరాజ్ ఇస్పాత్ విస్తరణ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని, వీటి ద్వారా భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని వివరించారు.
దేశంలో ఏర్పాటవుతున్న కొత్త పరిశ్రమల్లో దాదాపు 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నాయని, త్వరలో ఈ వాటా 50 శాతానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమల పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
క్లస్టర్ యూనివర్సిటీ ప్రాంగణంలో మినరల్ వాటర్ ప్లాంట్, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి విడతల వారీగా సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వెంకట బసవరావు మాట్లాడుతూ, యూనివర్సిటీ ద్వారా నాణ్యమైన విద్యతో పాటు పరిశోధనలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. యువత ఉపాధి అవకాశాల కోసం మంత్రి టీజీ భరత్ ప్రత్యేక చొరవ తీసుకుని జాబ్ మేళాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో సిల్వర్ జూబ్లీ కళాశాల ప్రిన్సిపాల్ నాగరాజు శెట్టి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆనందరాజ్ కుమార్, రిజిస్ట్రార్ శ్రీనివాసులు, అడ్మినిస్ట్రేటర్ అక్తర్ భాను తదితరులు పాల్గొన్నారు.
