సమృద్ధిగా తొలకరి వర్షాలు..
సమృద్ధిగా తొలకరి వర్షాలు..
- వ్యవసాయ పనులు ముమ్మరం
- విత్తనాలు వేస్తున్న రైతులు
- అధికంగా వరి, పత్తి విత్తనాల సాగు
నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఈ వానాకాల వ్యవసాయ సీజన్‌లో రోహిణి కార్తె అనంతరం జిల్లావ్యాప్తంగా సమృద్ధిగా తొలకరి వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే గత నాలుగు ఐదు రోజులుగా కొన్ని మండలాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసినప్పటికీ, శుక్రవారం తెల్లవారుజామున జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో విత్తనాలు వేసేందుకు అనుకూలంగా వర్షాలు కురిశాయని రైతులు, వ్యవసాయ అధికారులు తెలిపారు.
రోహిణి కార్తె 15 రోజులు, మృగశిర కార్తె నాలుగు రోజులు పూర్తైన నేపథ్యంలో మొత్తం 19 రోజుల తర్వాత మంచి వర్షాలు పడటంతో రైతుల్లో ఆనందం నెలకొంది. మరో మూడు నాలుగు రోజులు కూడా వర్షాలు కురిస్తే జిల్లావ్యాప్తంగా విత్తనాల విత్తకం పూర్తిస్థాయిలో ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే దాదాపు 10 శాతం మంది రైతులు బోర్ల నీటితో పొలాలను తడిపి వరి సాగు కోసం విత్తనాలు వేశారని సమాచారం. ప్రస్తుతం కురిసిన వర్షాలు ఆ పంటలకు మరింత బలాన్నిస్తాయని రైతులు పేర్కొంటున్నారు. అలాగే పత్తి, వరి, మొక్కజొన్న, జొన్న తదితర పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు.
జిల్లాలో అత్యధికంగా ఉప్పునుంతల మండలంలో 81.8 మిల్లీమీటర్లు, అచ్చంపేట మండలంలో 70.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 14 మండలాల్లో మోస్తరు వర్షాలు, 16 ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, రెండు మండలాల్లో స్వల్ప వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

ఈ ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 1,92,796 ఎకరాల్లో వరి సాగు జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే 3,08,845 ఎకరాల్లో పత్తి, 96,992 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తారని వ్యవసాయ శాఖ భావిస్తోంది.
ఈ మేరకు 48,199 క్వింటాళ్ల వరి విత్తనాలు, 2,780 క్వింటాళ్ల పత్తి విత్తనాలు, 7,759 క్వింటాళ్ల మొక్కజొన్న విత్తనాలు అవసరమవుతాయని జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్‌రావు తెలిపారు.
వ్యవసాయ పనులను రైతులు ముమ్మరం చేశారు. ఇప్పటికే పొలాలను శుభ్రం చేసి, దుక్కి దున్ని, గుంటకల్లు కొట్టి వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుక్రవారం తెల్లవారుజామున కురిసిన వర్షాలు ఊరటనిచ్చాయి. ఖరీఫ్ సాగుపై రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి.
