వైభవంగా అధిక జ్యేష్ఠ మాస శనిత్రయోదశి పూజలు..
వైభవంగా అధిక జ్యేష్ఠ మాస శనిత్రయోదశి పూజలు..
తాడిగడప శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా తైలాభిషేకాలు
శనైశ్చర స్వామికి విశేష ఆరాధన నిర్వహించిన అర్చకులు
మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలతో మారుమోగిన ఆలయం
భక్తుల రద్దీతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న దేవస్థానం
విజయవాడ, ఆంధ్రప్రభ : అధిక జ్యేష్ఠ మాస శనిత్రయోదశి, మాసశివరాత్రి పర్వదినాలను పురస్కరించుకుని తాడిగడపలోని శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఉదయం 4 గంటల నుంచే ఆలయ ప్రధాన అర్చకులు గూడూరు అజయ్ పద్మనాభశర్మ ఆధ్వర్యంలో శనైశ్చర స్వామికి వేదమంత్రోచ్ఛారణల నడుమ తైలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. శనిత్రయోదశి సందర్భంగా శని దోష నివారణ, ఆయురారోగ్యాలు, ఐశ్వర్య ప్రాప్తి కోసం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తదుపరి శ్రీ కాళహస్తీశ్వర స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. రుద్రనామ పారాయణాలు, వేదఘోషల మధ్య జరిగిన అభిషేక కార్యక్రమం ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపింది. శివభక్తులు భక్తిప్రపత్తులతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. మాసశివరాత్రి, శనిత్రయోదశి ఒకేరోజు రావడం విశేషమని, ఈ సందర్భంగా నిర్వహించిన పూజల్లో పాల్గొనడం ద్వారా విశేష పుణ్యఫలితాలు లభిస్తాయని అర్చకులు తెలిపారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ఆలయంలో రోజు పొడవునా భక్తుల రద్దీ కొనసాగగా, స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.
