Puttaparthi మున్సిపల్ కార్యాలయంపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

Puttaparthi మున్సిపల్ కార్యాలయంపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

– సేవలపై కఠిన హెచ్చరికలు

శ్రీ సత్యసాయి బ్యూరో (Puttaparthi), ఆంధ్రప్రభ:

పుట్టపర్తి మున్సిపల్ పరిపాలనలో సేవల నాణ్యతను మెరుగుపరచడం, ప్రజా సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ శుక్రవారం మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించిన ఆయన రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు, ప్రజల నుంచి అందుతున్న వినతుల పరిష్కార విధానంపై అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విధులకు ఆలస్యంగా హాజరయ్యే వారు, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులు, సిబ్బందిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పుట్టపర్తి అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో పట్టణ పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రధాన రహదారులు, కాలనీలు, ప్రజా ప్రదేశాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, డ్రైనేజీల పూడికతీత పనులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

‘స్పందన’ సహా ఇతర విభాగాల ద్వారా వచ్చే ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఫిర్యాదుదారులకు వారి సమస్యల స్థితిగతులపై స్పష్టమైన సమాచారం అందించాలని సూచించారు.

సిమెంట్ రహదారులు, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. మున్సిపాలిటీ ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారించి పన్నుల వసూళ్లను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

ఈ తనిఖీలో మున్సిపల్ కమిషనర్ జి. శ్రీనివాసులు, ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply