Utnoor | బాబాపూర్‌కు నూతన గ్రామపంచాయతీ భవనం

Utnoor | బాబాపూర్‌కు నూతన గ్రామపంచాయతీ భవనం

  • ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చేతుల మీదుగా పంచాయతీ భవన ప్రారంభం
  • గ్రామాభివృద్ధికి కృషి చేయాలి: ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఉట్నూర్, ఆంధ్రప్రభ: అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని బాబాపూర్ గ్రామపంచాయతీ నూతన భవనాన్ని శుక్రవారం సాయంత్రం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామపంచాయతీకి నూతన భవనం అందుబాటులోకి రావడం వల్ల ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం కలుగుతుందన్నారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో పంచాయతీ ప్రతినిధులు చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.

అనంతరం బాబాపూర్ గ్రామ సర్పంచ్ మెస్రం గంగాదేవి ప్రభాకర్ గ్రామంలోని పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. గ్రామపంచాయతీ పరిధిలో రహదారుల నిర్మాణం, తాగునీటి సౌకర్యం, విద్యా వసతులు, కల్వర్టుల నిర్మాణం, అంగన్‌వాడీ భవనాలు, ప్రహరీ గోడల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.

వినతిపై స్పందించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సానుకూలంగా స్పందిస్తూ, గ్రామ అభివృద్ధికి అవసరమైన పనులకు నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో సుధీర్ రెడ్డి, పంచాయతీరాజ్ డీఈ పవార్ రమేష్, అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.