రాజకీయాలకు అతీతంగా స్కూళ్ల అభివృద్ధి: బండి సంజయ్
రాజకీయాలకు అతీతంగా స్కూళ్ల అభివృద్ధి: బండి సంజయ్
సమాజ సేవకే తొలి ప్రాధాన్యతనిచ్చానన్న కేంద్ర మంత్రి
రేకొండ పాఠశాలకు డైనింగ్ హాల్ నిర్మాణ హామీ
తరగతి గదుల కోసం రూ.20 లక్షల సాయం ప్రకటించిన బండి
టెన్త్ విద్యార్థులకు ఉచిత సైకిళ్లు అందిస్తామని వెల్లడి
చిగురుమామిడి, (ఆంధ్రప్రభ): రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తానని, సమాజ సేవకే తన తొలి ప్రాధాన్యత అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ పాఠశాలలో నిర్వహించిన ‘టిఫిన్ బైఠక్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్థానికులు తీసుకొచ్చిన సద్దిని వారితో కలిసి ఆరగించిన బండి సంజయ్, అనంతరం పాఠశాలలో పరిశుభ్రత, మౌలిక సదుపాయాలపై ఉపాధ్యాయులు, గ్రామస్థులతో చర్చించారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత సమాజ సేవకే ప్రాధాన్యతనిస్తూ విద్యా సంస్థల అభివృద్ధికి కృషి చేస్తున్నానని తెలిపారు.
పాఠశాలలో డైనింగ్ సౌకర్యం లేకపోవడంపై ఉపాధ్యాయులు వివరించగా వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి డైనింగ్ హాల్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఉన్నత పాఠశాల విద్యార్థుల భోజన సౌకర్యాల కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తానని ప్రకటించారు.
అలాగే ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల కొరత ఉందని తెలియజేయడంతో, గదుల నిర్మాణం కోసం రూ.20 లక్షల సాయం చేస్తానని తెలిపారు. ఇందులో తొలి విడతగా రూ.10 లక్షలు విడుదల చేస్తానని హామీ ఇచ్చారు.
రేకొండ పాఠశాలలో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఈ సందర్భంగా బండి సంజయ్ అభినందించారు. గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా పదో తరగతి విద్యార్థులందరికీ ఉచిత సైకిళ్లు అందిస్తామని ప్రకటించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన 12 సంవత్సరాల విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్థానికులను కోరిన బండి సంజయ్, ఆ విజయాలకు సంబంధించిన పుస్తకాలను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మికి అందజేశారు.
