Rayalaseema Steel Plant | బంగారుసీమ కాబోతోన్న రాయలసీమ
Rayalaseema Steel Plant | బంగారుసీమ కాబోతోన్న రాయలసీమ
రాయలసీమలో స్టీల్ ప్లాంట్…
Rayalaseema Steel Plant | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: రాయలసీమకు స్టీల్ ప్లాంట్ రాబోతుందని, రాయలసీమ బంగారుసీమ కాబోతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతి దామినేడులో నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
2024 ఎన్నికల్లో కూటమికి 57 శాతం ఓటు షేర్, 94 శాతం స్ట్రైక్ రేట్ వచ్చిందని పేర్కొన్న చంద్రబాబు.. రాష్ట్రాన్ని గెలిపిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం అని ప్రజలను కోరగా వారు విశేష మద్దతు ఇచ్చారని తెలిపారు. తన రాజకీయ ప్రయాణం తిరుపతిలోనే ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రం, దేశం బాగుండాలని కోరుకునే నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు.
వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు.. ప్రజావేదిక కూల్చివేతతోనే జగన్ పాలనలో అరాచకాలకు తెరలేచిందన్నారు. కేంద్ర పథకాలు, సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని, అప్పులు, అరాచకాలు, ఆర్థిక విధ్వంసం తప్ప గత ప్రభుత్వం రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. కేసులు, జైళ్లతో చీకటి పాలన సాగిందని ఆరోపించారు.
నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి, పోలవరం, రైల్వే జోన్ వంటి కీలక అంశాల్లో పురోగతి సాధించామని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల హామీల అమలులో వెనక్కి తగ్గలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 63 లక్షల మందికి ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా కుటుంబంలోని ప్రతి విద్యార్థికి ప్రయోజనం చేకూరుస్తున్నామని చెప్పారు.
అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని, రైతులు, గీత కార్మికులు, వడ్డెర్లు, చేనేత కార్మికులు సహా అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నామని వెల్లడించారు. పీ-4 విధానంతో ఆర్థిక అసమానతలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై ప్రతిష్ఠను పెంచుకుందని చంద్రబాబు అన్నారు. ఆపరేషన్ సిందూర్ దేశానికి ఆత్మవిశ్వాసం కల్పించిందని పేర్కొన్నారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలో అగ్రశక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని సీఎం తెలిపారు. పుట్టపర్తిలో ఐదో తరం ఫైటర్ జెట్ తయారీ యూనిట్, తిరుపతిలో బుల్లెట్ ఫ్యాక్టరీ ఏర్పాటవుతున్నాయని వెల్లడించారు. వచ్చే నెలలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ ప్రారంభిస్తామని చెప్పారు. గ్రీన్ ఎనర్జీ, సోలార్, విండ్ పవర్ రంగాల్లో భారీ పెట్టుబడులు వస్తున్నాయని, రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. రూ.లక్ష కోట్లతో రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చే కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కల్యాణి డ్యామ్‌కు ఈ ఏడాదే నీళ్లు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని గందరగోళంలోకి నెట్టారని విమర్శించిన చంద్రబాబు.. “మూడు రాజధానులు కాదు.. మూడు ప్రాంతాల సమాన అభివృద్ధే మా లక్ష్యం” అని స్పష్టం చేశారు.
