ఇటుక బట్టీ కార్మికులకు కనీస వసతులు కల్పించాలి..

ఇటుక బట్టీ కార్మికులకు కనీస వసతులు కల్పించాలి..

  • కార్మికుల పిల్లలకు విద్యా బోధన అందించాలి
  • జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : ఇటుక బట్టీలలో పనిచేసే వలస కార్మికులకు యజమానులు కనీస వసతులు, సౌకర్యాలు కల్పించాలని పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ఆదేశించారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ సందర్భంగా శుక్రవారం రాఘవాపూర్ కేకేఆర్ ఇటుక బట్టీలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి. భవనితో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా న్యాయమూర్తి సునీత మాట్లాడుతూ కార్మికులకు ఆవాస వసతి, వారి పిల్లలకు విద్యా బోధన అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రతీ కార్మికులకు తప్పనిసరిగా లేబర్ కార్డు ఉండలాని, వారికి బ్యాంకు ఖాతాల ద్వారా కూలీ వేతనాలు చెల్లించాలని తెలిపారు. కార్మిక చట్టం నిబంధనలు తప్పకుండా పాటించాలని, ఉల్లంఘిస్తే యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బట్టీలో కార్మికులకు కల్పించిన సౌకర్యాలు, వసతులను న్యాయమూర్తులు పరిశీలించి సూచనలు చేశారు. వసతులు, సౌకర్యాలు మరింత మెరుగుపరచాలని యజమానులను ఆదేశించారు. అలాగే ఈ ప్రాంతంలోని ఇతర ఇటుక బట్టీల యజమానులు కార్మికులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో పెద్దపల్లి తహసీల్దార్ రాజయ్య, పెద్దపల్లి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రఫి, రూరల్ ఎస్ఐ శ్వేత, ఇటుక బట్టీలో పనిచేసే కార్మికులు, యజమానులు పాల్గొన్నారు.

Leave a Reply