4,399 రోజుల పాలనతో మోదీ సరికొత్త రికార్డు

4,399 రోజుల పాలనతో మోదీ సరికొత్త రికార్డు

2029, 2034 ఎన్నికల్లోనూ మోదీ నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష: శ్రీనివాస వర్మ

సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రధాని ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక పూజలు

భీమవరం, ఆంధ్రప్రభ : భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రజల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నికై, అత్యంత సుదీర్ఘకాలం నిరంతరాయంగా ప్రజాస్వామ్య పాలన సాగిస్తున్న ఏకైక ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ సరికొత్త చరిత్ర సృష్టించారని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు.

ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 4,399 రోజుల పాలన పూర్తి చేసిన సందర్భంగా ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని, దేశం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ భీమవరం పంచారామ క్షేత్రమైన శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామివారి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మకు ఆలయ చైర్మన్, అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ పేరిట సోమేశ్వర స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత శ్రీ అన్నపూర్ణ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రీనివాస వర్మ, ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం సుభిక్షంగా ఉండాలని, భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనపై ఉండాలనే సంకల్పంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల్లో పూజలు, హోమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

స్వాతంత్ర్యం అనంతరం ప్రజల చేత నేరుగా ఎన్నికై, అత్యధిక కాలం నిరంతరాయంగా ప్రధానిగా కొనసాగుతున్న నాయకుడిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ ఎక్కువ కాలం ప్రధానిగా ఉన్నారనే అపోహ కొందరిలో ఉందని, అయితే 1952 వరకు ఆయన నామినేటెడ్ ప్రధానిగానే ఉన్నారని గుర్తుచేశారు.

రాబోయే 2029, 2034 ఎన్నికల్లో కూడా మోదీ ఘన విజయం సాధించి దేశాన్ని మరింత ముందుకు నడిపించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా మోదీ నాయకత్వంలోనే దేశానికి భద్రత, సుభిక్షం లభిస్తాయనే విశ్వాసం ప్రజల్లో ఉందని తెలిపారు.

మోదీ సమర్థవంతమైన నాయకత్వం వల్లే అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రతిష్ట మరింత పెరిగిందని, ప్రపంచవ్యాప్తంగా భారతీయుల గౌరవాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడంలో మోదీ పాత్ర కీలకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చింతలపాటి బంగార్రాజు, ధర్మకర్తలు యార్లగడ్డ రమేష్, కొప్పర్తి విజయ్ కుమార్, పడమట లీలా, సాయి విజయలక్ష్మి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ, జిల్లా ఉపాధ్యక్షులు కాయిత సురేంద్ర, గోవర్ధన్, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

ఫోటో రైట్ అప్: భీమవరం శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామివారి ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటున్న కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ.

Leave a Reply