చింతూరు – మారేడుమిల్లి ఘాట్‌లో మిని బస్సు బోల్తా

చింతూరు – మారేడుమిల్లి ఘాట్‌లో మిని బస్సు బోల్తా
- ముగ్గురికి తీవ్ర గాయాలు – 7 గురికి స్వల్ప గాయాలు
- ఘాట్ రోడ్‌లో తప్పిన పెను ప్రమాదం – టైర్ ఫంక్ష్చర్ తో ఘటన
- ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 15 మంది ప్రయాణికులు
- భద్రాచలం శ్రీ సీతారాముల స్వామీ వారి దర్శనానికి వస్తుండుగా ప్రమాదం
చింతూరు, ఆంధ్రప్రభ : పోలవరం జిల్లా చింతూరు – మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ప్రైవేట్ మిని బస్సు ప్రమాదానికి గురై రోడ్డుకి అడ్డంగా బోల్తా పడింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కోరంగి నుండి భద్రాచలంలోని రాములవారి ఆలయానికి శ్రీ సీతారాముల స్వామీ దర్శనానికి బయలుదేరి వస్తుండుగా మార్గం మధ్యంలో చింతూరు – మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో చింతూరు మండలం ఘాట్ రోడ్డులోని వన దుర్గమ్మ తల్లి గుడికి సుమారు 2 కిలో మీటర్ల దూరంలో ప్రమాదం జరిగింది.

మిని బస్సు టైర్ ఒక్కసారిగా పేలి ఫంక్ష్చర్ అవ్వడంతో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 15 మంది ప్రయాణికులు (యాంత్రికులు) ఉండగా వారిలో మొత్తం 10 మందికి గాయాలు కాగా వారిలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మరో 7 గురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయాలపాలైన క్షతగాత్రులను రాజమండ్రి వైపు నుండి చింతూరు వైపు వస్తున్న చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన గుప్తా బస్సులో తీసుకొచ్చి చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి వైద్యులు గాయపడ్డ వారికి ప్రధమ చికిత్సలు నిర్వహించి ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదని ఆసుపత్రి పర్యవేక్షణాధికారి డాక్టర్ కోటీ రెడ్డి తెలిపారు.

ఈ ప్రమాదంలో వల్లెం శివరామ్, మామిడి నాగేంద్ర, మామిడి హైమావతిలకు తీవ్ర గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పింది. టైర్ ఫంక్ష్చర్ కావడంతో బస్సు కంట్రోల్ కాక రోడ్డు మీదే బోల్తా పడింది. ప్రమాదవశాత్తు ఘాట్ రోడ్ లోయలో పడి ఉంటే పెను ప్రమాదం జరిగేది. ఈ మిని బస్సులో ఉన్నవారు అందరూ ఒకరికి ఒకరు బందువులే అని తెలిసింది. దైవ దర్శనానికి వస్తూ ప్రమాదం జరగడంతో తీవ్ర అందోళనకు గురయ్యారు. చింతూరు – మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో తరుచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

