తప్పులు లేని ఓటర్ల జాబితా కోసమే ‘సర్’ కార్యక్రమం
తప్పులు లేని ఓటర్ల జాబితా కోసమే ‘సర్’ కార్యక్రమం
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : తప్పులు లేని, ఖచ్చితమైన ఓటర్ల జాబితా రూపొందించడమే ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఓటరును ప్రత్యక్షంగా కలుసుకుని, వారి వివరాలను ధృవీకరించడం ద్వారా శుద్ధమైన, ఖచ్చితమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
బుధవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో జూమ్ సమావేశం నిర్వహించి ‘సర్’ కార్యక్రమంపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జూన్ 15 నుంచి జూలై 14 వరకు జిల్లాలోని బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓలు) ఇంటింటి పర్యటనలు నిర్వహిస్తారని తెలిపారు. ప్రతి ఓటరుకు పాక్షికంగా నింపిన ఎన్యుమరేషన్ ఫారాలను అందజేసి, అవసరమైన వివరాలు పూర్తి చేసిన అనంతరం వాటిని తిరిగి సేకరిస్తారని వివరించారు.
ఓటర్లు తమ వివరాలను లేదా కుటుంబ సభ్యుల వివరాలను 2002 ఇంటెన్సివ్ రివిజన్ ఓటరు రికార్డులతో అనుసంధానం చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ప్రతి ఫారంపై సంబంధిత బీఎల్‌ఓ ఫోన్ నంబర్ అందుబాటులో ఉంటుందని, సందేహాల నివృత్తి కోసం వారిని సంప్రదించవచ్చన్నారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెబ్‌సైట్‌లో కూడా ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించబడుతుందని, ఆ తేదీ నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. వాటి పరిశీలన, పరిష్కార ప్రక్రియ సెప్టెంబర్ 18 వరకు కొనసాగి, సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా విడుదల అవుతుందని వెల్లడించారు.
ప్రజలందరూ బీఎల్‌ఓలకు సహకరించి సరైన సమాచారం అందించి ఓటర్ల జాబితా శుద్ధీకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి బి. శివన్నారాయణరెడ్డి, వివిధ నియోజకవర్గాల ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బీఎల్‌ఓలు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
