జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీలకు చర్యలు..

వనపర్తి టౌన్, ఆంధ్రప్రభ : వనపర్తి జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల విషయంలో రాయితీలు కల్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) వనపర్తి జిల్లా శాఖ బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి ని కలిసి వినతిపత్రం సమర్పించింది.

ఈ సందర్భంగా జిల్లా విద్యా పర్యవేక్షణ అధికారి శ్రీనివాసాచారికి టిడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం శ్రీనివాసాచారి మాట్లాడుతూ, గతంలో కూడా జర్నలిస్టుల పిల్లలకు విద్యా విషయంలో రాయితీలు కల్పించినట్లు తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కూడా వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల విషయంలో రాయితీలు కల్పించేలా సంబంధిత విద్యాసంస్థలకు అవసరమైన ఆదేశాలు జారీ చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

జర్నలిస్టుల సంక్షేమం పట్ల సానుకూలంగా స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారులకు, ముఖ్యంగా శ్రీనివాసాచారికి టిడబ్ల్యూజేఎఫ్ వనపర్తి జిల్లా బృందం కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) వనపర్తి జిల్లా అధ్యక్షుడు అంబటి స్వామి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి ఆర్థికకార్యదర్శి పవన్ కుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎండి నిరంజన్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎర్రమను బాలరాజు ఇటీవల కాలంలో టీ డబ్ల్యూ సభ్యత్వం పొందిన విజయ రామ్ రెడ్డివినతి పత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు.